క్షణక్షణం టెన్షన్
పొదలకూరు : కండలేరు జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరువుగా నీటి నిల్వలు ఉండడంతో అటు అధికారులు, ఇటు దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. జలాశయం రాపూరు మండలంలో ఉన్నా.. స్పిల్‌వే చేజర్ల మండలంలో ఉంది. జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంటే స్పిల్‌వే నుంచి నీటిని విడుదల చేస్తే పొదలకూరు మండలంలోని పర్వతాపురం, అంకుపల్లి, ఊసపల్లి, వావింటపర్తి గ్రామాల మీదుగా నీటి ఉధృతి కండలేరు ఏటికాలువలో కలిసి సముద్రానికి వెళతాయి. తాజాగా పరిణామాల్లో తెలుగుగంగ అధికారులు స్పిల్‌వే ద్వారా నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోమశిల నుంచి వరద ద్వారా కండలేరుకు నీరు విడుదల ఆగకుండా వస్తూనే ఉన్నందున కండలేరులో నీటి నిల్వలు ప్రమాదక స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.
అటవీ అనుమతులు లేక
ఆగిన కాలువ పనులు
స్పిల్‌వే కాలువ 1.5 కి.మీ. నుంచి పనులు నిలిచిపోయాయి. ఇక్కడ అటవీ భూములు ఉండడంతో కాలువ పనులను చేయనీయకుండా సంబంధిత అధికారులు నిలిపివేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ముందుగా అటవీ భూముల్లో అధికారులు కాలువను తవ్వించారు. తర్వాత అటవీశాఖ అధికారులు అనుమతులు లేవని కాలువను పూడ్పించారు. ఈ క్రమంలో స్పిల్‌వే నుంచి వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే కాలువ లేకుండా నీరు ఎలా వెళుతుందనే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. అయితే అటవీభూముల్లో తాత్కాలికంగా కాలువను తవ్వించి అవసరమైతే నీటిని విడుదల చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సాధ్యాసాధ్యాలను బుధవారం పరిశీలించినట్లు సమాచారం.
గ్రామాల్లో దండోరా
నీటిని విడుదల చేస్తే మండలంలోని పర్వతాపురం, అంకుపల్లి, ఊసపల్లి, వావింటపర్తి గ్రామాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో బుధవారం రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. స్పిల్‌వే మీదుగా కండలేరు వరద నీటిని విడుదల చేస్తే దిగువ గ్రామాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పశువులను వాగుల వెంట వదిలి వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అవసరమైతే గ్రామస్తులను తరలించాల్సి వస్తుందని కూడా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. గతంలో 50 టీఎంసీల పైబడి నీటి నిల్వలు ఉంటేనే కండలేరు మట్టికట్ట 5.50 కి.మీ వద్ద కట్ట మట్టి ఊడి కింద పడింది. దీంతో కట్టకు ప్రమాదం వాటిల్లిందని ప్రచారం జరిగి పొదలకూరు మండలం ఇనుకుర్తి, ముదిగేడు, డేగపూడి గ్రామస్తులు పొదలకూరు జెడ్పీ హైస్కూల్‌కు వచ్చి తలదాచుకున్నారు. తర్వాత అధికారులు ధైర్యం చెప్పడంతో ఊర్లకు వెళ్లారు. మట్టికట్ట ఊడిపడిన ప్రాంతంలో అధికారులు రివిట్మెంట్ చేపట్టి పటిష్టం చేశారు.
స్పిల్ వే వెనుక వైపు ఉన్న కండలేరు నీరు
జిల్లాలోని మరో జలనిధి కండలేరు నిండుకుండగా ఉంది. కొన్ని రోజులుగా సోమశిల నుంచి వరద కాలువ ద్వారా కండలేరుకు నీటి విడుదల చేస్తున్నారు. 68 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయం బుధవారానికి దాదాపు 60 టీఎంసీలకు చేరింది. అయితే సోమశిల నుంచి కండలేరుకు వరద జలాలు ఆపకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్య కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జలాశయం క్యాచ్‌మెంట్ ఏరియాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు వరద పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్ట్ భద్రత నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో దిగువ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కండలేరులో
60 టీఎంసీలు దాటిన నీటి నిల్వ
సోమశిల నుంచి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
స్పిల్‌వే ద్వారా నీటి విడుదలకు
సన్నాహాలు
భయాందోళనలో దిగువ గ్రామస్తులు
అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరా
అటవీ అనుమతులు లేక పూర్తికాని స్పిల్‌వే కాలువ పనులు
దండోరా వేయించాం
తెలుగుగంగ అధికారుల సూచన మేరకు వారితో చర్చించి స్పిల్‌వే దిగువ గ్రామాల్లో దండోరా వేయించాం. స్పిల్‌వే గుండా నీటిని విడుదల చేసే పరిస్థితి తలెత్తదని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. అవసరమైతే ముందస్తుగా గ్రామస్తులను తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామస్తులను అప్రమత్తం చేయడం జరిగింది.
– బి.శివకృష్ణయ్య, తహసీల్దార్,
పొదలకూరు
క్షణక్షణం టెన్షన్
క్షణక్షణం టెన్షన్


