విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు
● డివిజన్లలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
● ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ రాఘవేంద్రం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ రాఘవేంద్రం అన్నారు. నగరంలోని విద్యుత్‌భవన్‌లోని స్కోడా కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లా విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి విద్యుత్ సిబ్బంది వారికి నిర్దేిశించిన హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచాలని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఐదు విద్యుత్ డివిజన్లలో 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్షాలు తగ్గే వరకు విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంచి మిగిలిన వారిని అత్యవసర సేవలకు ఉపయెగించుకోవాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలు పడిపోయినా, లైన్లు తెగిపడినా వాటిని పునరుద్ధరించేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. సెల్‌ఫోన్లకు ఫుల్ చార్జింగ్ పెట్టుకోవాలని, రోప్స్, డ్రిల్లింగ్ మెషిన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.


