ఇరిగేషన్‌ కతలు ఇంతింత కాదయా..! | - | Sakshi
Sakshi News home page

ఇరిగేషన్‌ కతలు ఇంతింత కాదయా..!

Oct 9 2025 6:04 AM | Updated on Oct 9 2025 6:04 AM

ఇరిగేషన్‌ కతలు ఇంతింత కాదయా..!

ఇరిగేషన్‌ కతలు ఇంతింత కాదయా..!

అంతా ఇష్టారాజ్యం ఏ పనైనా.. కాసులిస్తేనే యథేచ్ఛగా దందాలు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఇరిగేషన్‌ శాఖలో అవినీతి పరవళ్లు తొక్కుతోంది. కాసులిస్తేనే ఏ పనైనా జరుగుతుంది. ఉద్యోగోన్నతులు రావాలంటే మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేయాల్సిందే. అలా జరిగినా సీనియర్‌ అసిస్టెంట్‌ నుంచి మేనేజర్‌ వరకు నగదును ముట్టజెప్పాల్సిందే. ఒకవేళ అలా కాని పక్షంలో వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతుంది.

ఉద్యోగోన్నతులకు ఇంతా..?

ఇరిగేషన్‌ శాఖలో ఉద్యోగోన్నతులకు నిబంధనలను నిర్దేశించారు. అయితే అటెండర్‌ (ఆఫీస్‌ సబార్డినేట్‌) నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌గా ప్రమోషన్‌ కావాలంటే రూ.10 వేలు నుంచి రూ.15 వేలు.. జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు.. ఆపై వీరు మంచి ప్రాంతానికి వెళ్లాలంటే రూ.20 వేల నుంచి రూ.30 వేలను ముట్టజెప్పాల్సిందే. కారుణ్య నియామకాలకు సైతం నగదును సమర్పించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

చీపుర్లకు రూ.వేలల్లో బిల్లులు

చీపుర్లు, నీళ్లకు నెలకు రూ.20 వేల బిల్లులను కార్యాలయంలోని ఒక సూపరింటెండెంట్‌ పెడుతున్నారని సమాచారం. హెచ్‌డీలు ఏళ్ల తరబడి ఒకే స్థానంలో పాతుకుపోయారు. అసోసియేషన్‌ నేతలుగా ప్రకటించుకుంటూ వారి స్థానాలు మారకుండా చూసుకుంటున్నారు. అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపేందుకు గానూ పనిని బట్టి వారికి పర్సంటేజీలను సమర్పించాలి. సంబంధిత ఏఈఈ, డీఈఈల ద్వారా వీరికి సదరు కాంట్రాక్టర్‌ అందించాల్సి వస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా నిరాకరిస్తే ప్రతిపాదనలు టేబుళ్లకే పరిమితమైపోతున్నాయి. ఇరిగేషన్‌ ప్రధాన కార్యాలయం, సెంట్రల్‌.. ఆత్మకూరు డివిజన్లు, ఆరు సబ్‌ డివిజన్లుండగా, ప్రతి చోట ఈ వ్యాపారం ఒకే రకంగా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ప్రశ్నించేవారేరీ..?

రహస్య టెండర్ల ప్రతిపాదనలను కాంట్రాక్టర్లకు అందించడం.. కుమ్మకై ్క వారందించిన డబ్బుతో అర్హత లేని వారికి టెండర్లను ఆమోదించడంలో ఓ మేనేజర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్‌ శాఖలో ప్రశ్నించే వారే లేకపోవడంతో ఆయన చెప్పిందే వేదమని కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పేర్కొంటున్నారు.

డైవర్షన్లలోనూ ఇదే తీరు..

ఈ శాఖలో డిప్యుటేషన్లపై పనిచేయడాన్ని డైవర్షన్‌ అంటారు. తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి డైవర్షన్‌ పొందేందుకు సుమారు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు చెల్లించాల్సి ఉంటోంది. డీఈఈ స్థాయి వారూ ఈ పనిచేయాల్సి వస్తోంది. లేఅవుట్లు, కల్వర్టులు, బ్రిడ్జిల అనుమతులకు సంబంధిత వ్యక్తుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ సంపాదనను పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ఈ శాఖలో అధిక శాతం మంది డైవర్షన్లోనే ఉంటున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి సదరు లేఅవుట్‌కు సంబంధించిన వ్యక్తులు బ్రిడ్జిలను నిర్మిస్తే వాటిని ఎం బుక్‌లో నమోదు చేసి ఇరిగేషన్‌ శాఖే సొంతంగా కట్టించినట్లూ చూపుతున్నారు. మరోవైపు సాధారణ సమయానికీ ఆఫీసులకు రారు. ఒక ఎన్టీపీఏ వేరే జిల్లా నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సైతం వస్తారు. వీరిపై ఎలాంటి చర్యల్లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తమ పనులను జరుపుకొంటున్నారు.

జిల్లా ఇరిగేషన్‌ శాఖలో వ్యవహారం

అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది.

ఏ పని జరగాలన్నా వారు చెప్పినంత క్యాష్‌ కొట్టాల్సిందే. కాలువల్లో నీరు పారుతుందో లేదో తెలియదు గానీ డబ్బులిస్తే మాత్రం ఆఫీస్‌లో అటెండర్ల మొదలుకొని డీఈల వరకు పనులు ఇట్టే జరిగిపోతాయి. ఉద్యోగోన్నతులు, అంచనాలు, ప్లాన్‌ ప్రతిపాదనలు, ఎల్‌ఓసీలు, ఉద్యోగుల డిప్యుటేషన్లు ఇలా ఏది కావాలన్నా.. సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరిండెంటెంట్లు, ఎన్టీపీఏలు, హెచ్‌డీలు, మేనేజర్లకు మొత్తాన్ని కక్కాల్సిందే. ఆ శాఖలో పనులకు నిధులు రాకపోవడంతో ఉద్యోగుల మధ్య

ఈ దందా పెరిగిపోతోంది.

చర్యలు చేపడతాం

ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సంబంధిత విభాగాల్లో విచారణ జరిపిస్తాం. బాధితులెవరైనా ఉంటే నేరుగా కలవొచ్చు. విచారణ జరిపి నిబంధనలను అనుసరించి ఆయా ఉద్యోగులపై చర్యలు చేపడతాం.

– దేశ్‌నాయక్‌, సూపరింటెండెంట్‌

ఇంజినీర్‌, ఇరిగేషన్‌ శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement