
ఏయ్.. మీ అంతు చూస్తా
● మా హాస్పిటల్ ముందే చెత్త ట్రాక్టర్లను ఆపుతారా..?
● పారిశుధ్య కార్మికులను దుర్భాషలాడిన టీడీపీ నేత కుమారుడు
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: అధికారముందనే ధీమాతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా బుచ్చిరెడ్డిపాళెంలోని మున్సిపల్ కార్మికులపై టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు కుమారుడు శంతన్ హర్ష బూతులతో చెలరేగిపోయారు. మున్సిపల్ కార్మికులు, స్థానికుల వివరాల మేరకు.. పట్టణ పరిధిలోని బస్టాండ్ కూడలి సమీపంలో గల పాత పెట్రోల్ బంక్ పక్కన శ్రీనివాసులు కుమారుడికి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఈ క్రమంలో దాని ఎదురుగా ట్రాక్టర్లను నిలిపి అందులో చెత్తను కార్మి కులు వేయసాగారు. ఈ తరుణంలో అక్కడికి చేరుకున్న శంతన్ హర్ష తమ హాస్పిటల్ ముందు ఎందుకు నిలిపారని ప్రశ్నించారు. పని అయిపోగానే వెళ్లిపోతామని కార్మికులు చెప్పినా వినకుండా.. ట్రాక్టర్లను నిలిపేందుకు ఎంత ధైర్యమంటూ బూతులతో రెచ్చిపోయారు. ట్రాక్టర్లకు గాలి తీసేసి.. దిక్కున్న చోట చెప్పుకోండంటూ జులుం ప్రదర్శించారు.
నిరసన
చెత్త ట్రాక్టర్లను హాస్పిటల్ ఎదుటే నిలిపి నిరసనను కార్మికులు వ్యక్తం చేశారు. తమను దూషించిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. మున్సిపాల్టీలోని ఇతర విభాగాల నేతలు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని కార్మికులు.. టీడీపీ నేత కుమారుడితో మాట్లాడటంతో గొడవ సద్దుమణిగింది.
విధులకు ఆటంకం కలిగించడం సరికాదు
మున్సిపల్ కార్మికులను దూషించడం, ట్రాక్టర్లకు గాలితీసి విధులకు భంగం కలిగించడం చట్టరీత్యా నేరం. తప్పును శంతన్ అంగీకరించడంతో విధుల్లో కార్మికులు చేరారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు చేపడతాం.
– బాలకృష్ణ, కమిషనర్