
బ్యాంక్‌లో అగ్నిప్రమాదం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బృందావనంలోని కర్ణాటక బ్యాంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడంతో ఆస్తి నష్టం తగ్గింది. అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు బృందావనంలో కర్ణాటక బ్యాంక్ ఉంది. ఇన్వర్టర్ బ్యాటరీ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. నెల్లూరు లీడింగ్ ఫైర్‌మెన్ బాలాజీ గురుప్రసాద్ నేతృత్వంలో కె.చంద్రశేఖర్, మల్లికార్జున, మధులు ఫైరింజిన్‌తో మూడు నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేనిపక్షంలో భారీగా నష్టం వాటిల్లేది. బ్యాంక్ జనరల్ మేనేజర్ సీహెచ్ సతీష్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వివరాలు సేకరించారు. ప్రమాదంలో రూ.3.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొన్నారు.