
తెలుగు తమ్ముళ్లకే పాసులు
నెల్లూరు(టౌన్): రొట్టెల పండగ సందర్భంగా ప్రత్యేక దర్శనాల కోసం ఇచ్చిన పాసుల్లో అధిక శాతం తెలుగు తమ్ముళ్ల వద్దకే వెళ్లినట్లు విమర్శలున్నాయి. దీంతో బారాషహీద్‌లను దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు క్యూలైన్‌లో పడిగాపులు కాశారు. స్థానికంగా ఉండే వారికి పాస్‌లు అందలేదని చెబుతున్నారు. మీడియా వర్గాలకు కూడా గతంలో మాదిరి కాకుండా తక్కువ సంఖ్యలో ఇచ్చారు. అయితే పాసుల పేరుతో కొంతమందిని క్యూలైన్లతో సంబంధం లేకుండా నేరుగా దర్గాలోకి ప్రవేశించారు. టీడీపీ నాయకులు దగ్గరుండి పంపించిన సందర్భాలున్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేర్లుగా క్యూలైన్లు ఉన్నా ఎక్కడా పాటించలేదు. అందరిని ఒకే లైన్‌లో పంపడంతో మహిళా భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. టీడీపీ నేతల తీరు కారణంగా క్యూలైన్లు రోడ్డు వద్దకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తాగునీటికి ఇబ్బంది పడిన వారెందరో. కొన్నిచోట్ల క్యూలైన్‌లకు టెంట్‌లు ఏర్పాటు చేయలేదు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు గంటల తరబడి ఎండలోనే నిరీక్షించారు.