
కార్మిక లోకం భారీ ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అభిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలంటూ పది సంఘాలకు చెందిన కార్మికులు కదం తొక్కారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం, ఏసీ బొమ్మ సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా మద్రాస్ బస్టాండ్ వరకు నిర్వహించారు. అక్కడ జరిగిన సభలో సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.జయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిశోర్‌లు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, అజయ్‌కుమార్, సాగర్, యానాదయ్య, టీవీవీ ప్రసాద్, ప్రసాద్, పెంచలప్రసాద్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, కత్తి శ్రీనివాసులు, మూలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.