తోటపల్లిగూడూరు: పంట కాలువలో పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని కొత్తపాళెం గ్రామంలో జరిగింది. ఎస్సై వీరేంద్రబాబు కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం పంచేడు గ్రామానికి చెందిన పాటి అశోక్ (29) మోటార్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. చెన్నకేశవ స్వామి తిరునాళ్ల సందర్భంగా కొత్తపాళెంలోని తన చెల్లెలు ఈదూరు అమూల్య ఇంటికి రెండు రోజుల క్రితం అశోక్ వచ్చాడు. సోమవారం రాత్రి ఆలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన అనంతరం అశోక్ బహిర్భూమి కోసం స్థానిక పంట కాలువ వద్దకు వెళ్లాడు.
అక్కడ గుండెపోటు రావడంతో పంట కాలువలో పడి ఊపిరాడక మృతిచెందినట్లు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గుర్తించిన స్థానికులు జరిగిన విషయం అశోక్ సోదరి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు.