
నాగలింగేశ్వర స్వామి ఆలయ పరిశీలన
ఆత్మకూరు: చేజర్ల మండలంలోని పెన్నానది ఒడ్డున పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో ఏడు దశాబ్దాల క్రితం ఇసుకలో పూడిపోయిన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. శనివారం ఆత్మకూరు పట్టణంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సాయంత్రం ఆలయాన్ని సందర్శించారు. గుడికి సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 70 ఏళ్ల క్రితం ఉధృతంగా వచ్చిన వరదలకు ఇసుక ఆలయాన్ని పూడ్చివేసింది. అప్పటి నుంచి పూజా కార్యక్రమాలకు దూరమైంది. ఈ నేపథ్యంలో 2020లో స్థానిక యువకుల చొరవ తీసుకుని ఆలయాన్ని వెలుగులోకి తెచ్చారు. కొంతమేర ఇసుక మేటను తొలగించారు. దీనిని పరిశీలించిన మంత్రిమాట్లాడుతూ జిల్లాకే తలమానికంలాంటి చరిత్ర కలిగిన ఆలయంలో పూర్తి స్థాయిలో ఇసుకను తొలగించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పునఃనిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట దేవదాయ శాఖ అధికారులు, సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వి.కేశవచౌదరి, శ్రీనివాసులునాయుడు, బూదళ్ల వీరరాఘవ రెడ్డి తదితరులున్నారు.