
ట్యాంపరింగ్.. జంబ్లింగ్ విధానానికే విఘాతం
కందుకూరు రూరల్: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల ట్యాంపరింగ్ అనేది జంబ్లింగ్ విధానానికే విఘాతమని గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారావు, డైరెక్టర్ భరద్వాజ్ పేర్కొన్నారు. కాలేజీకి చెందిన అవినాష్‌బాబు, సాయితేజశ్విని జవాబు పత్రాల ట్యాంపరింగ్ విషయమై కళాశాలలో విలేకరులతో బుధవారం వారు మాట్లాడారు. ట్యాంపరింగ్ అంశాన్ని బోర్డు అధికారులు నిర్ధారించి బాధిత విద్యార్థులకు మార్కులను కలిపారని తెలిపారు. దీనిపై సంబంధిత వివేకా జూనియర్ కళాశాలపై బోర్డు అధికారులు విచారణ జరిపి రెండు వారాలు దాటినా, నేటికీ చర్యలను చేపట్టలేదని చెప్పారు. పరీక్ష కేంద్రంగా చూపించిన భవనం ఒకటని, విద్యార్థులతో పరీక్ష రాయించిన షెడ్లు వేరుగా ఉందనే విషయాన్ని విచారణలో ప్రశ్నించారని తెలిపారు. వివేకా కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు కాగా, ఆయన స్థానంలో షాహుల్ హమీద్‌ను అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించారని తెలిపారు. వాస్తవానికి బోర్డు ఐడీ తప్పనిసరని, అయితే షాహుల్ హమీద్‌కు ఇది లేదన్నారు. ట్యాంపరింగ్ జరిగిన పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా పనిచేసిన అధ్యాపకుడ్ని కళాశాల నుంచి తొలగించామని యాజమాన్యం బోర్డు అధికారులకు సమాచారమిచ్చిందని, ఎలాంటి తప్పు చేయకపోతే ఇలా ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. బోర్డుకు సమర్పించిన లేఖలో షాహుల్ హమీద్‌ను ప్రిన్సిపల్‌గా చూపిస్తూ, సంతకం మాత్రం ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లుగా పెట్టి పంపారని తెలిపారు. కారకులపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు.