చిన్న కాంట్రాక్టర్లపై కక్షెందుకు..?
నెల్లూరు (పొగతోట): పెద్ద కాంట్రాక్టర్లకు రూ.కోట్లల్లో బిల్లులను సకాలంలో ఇస్తున్నా, చిన్న కాంట్రాక్టర్లకు రూ.లక్ష బిల్లులను చెల్లించేందుకు తీవ్ర జాప్యం జరుగుతోందని, ఫలితంగా వారు నష్టపోతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. త్వరితగతిన చెల్లించేలా చూడాలని ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. జలజీవన్ మిషన్‌కు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సూచించారు.
వినతులు స్వీకరిస్తున్నా, పరిష్కారమేదీ..?
సమస్యల పరిష్కారానికి అధికారులు వినతులను స్వీకరిస్తున్నా, పరిష్కారం చూపడంలేదన్నారు. జెడ్పీటీసీలు సమర్పించిన వినతులకే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఎంపీ నిధులను ఏడాది క్రితం మంజూరు చేయించినా, పనులను నేటికీ ప్రారంభించలేదని అసహనం వ్యక్తం చేవారు. నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరులో పాఠశాల అభివృద్ధికి జెడ్పీ ద్వారా నిధులను కేటాయించామని, శంకుస్థాపన సమయంలో ప్రొటోకాల్‌ను పాటించలేదని చెప్పారు. దీనికి సంబంధించి పీఆర్ ఏఈపై చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు మూడు నెలల క్రితం విన్నవించినా, నేటికీ ఎలాంటి సంజాయిషీ లేదన్నారు.
చర్యలకు డిమాండ్
ఆత్మకూరులో బ్రిటిష్ కాలం నాటి భవనాన్ని నేలకూల్చి రంగూన్ టేకును మాయం చేశారని, మంత్రికి సమాచారమివ్వకుండానే ఎలా కూలుస్తారని.. దీనికి అనుమతులను ఎవరిచ్చారని ప్రశ్నించారు. కలప సగానికిపైగా మాయమైందని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కూలీలకు పనులు కల్పించాలి
ఉపాధి పనులకు సంబంధించిన పేమెంట్లను సకాలంలో చెల్లించి కూలీలకు వర్కులను కల్పించాలని సూచించారు. నూతన గృహాలను ప్రస్తుతం మంజూరు చేయడంలేదని, దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాలకు వెళ్తే లాగిన్లు పనిచేయడంలేదన్నారు. సమావేశాలకు అధికారులు సమయపాలన పాటించడంలేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించాలని కోరారు.
దయనీయంగా రైతుల పరిస్థితి
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పుట్టి ధాన్యం రూ.28 వేల నుంచి రూ.30 వేల వరకు విక్రయించడంతో రైతులు సుభిక్షంగా ఉన్నారని, అయితే ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో పంటల సాగుకు రైతులు పూర్తిస్థాయిలో ముందుకు రావడం లేదని వ్యవసాయాధికారులు నివేదికలివ్వడంపై చైర్‌పర్సన్ అసహనం వ్యక్తం చేశారు. కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి ఖర్చు చేసుకోకుండా.. ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు పొందాలని కోరారు. నిధులను మంజూరు చేసినా అంగన్‌వాడీ భవనాలను నిర్మించలేదని, జిల్లాలో ఇలా అద్దె భవనాల్లో ఎన్ని కేంద్రాలను నిర్వహిస్తున్నారు.. ఎంత ఖర్చు చేస్తున్నారు.. సొంత బిల్డింగులను నిర్మించుకోరానని ఐసీడీఎస్ అధికారులను ప్రఽశ్నించారు. గ్రామాల్లో జెడ్పీటీసీలు పర్యటించి, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. బీసీ కార్పొరేషన్, ఇతర సంక్షేమ శాఖల ద్వారా అవసరమైన వారికే పథకాలను మంజూరు చేయించుకుంటూ, అర్హులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. జెడ్పీ సీఈఓ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బిల్లులు రాక తీవ్రంగా నష్టపోతున్నారు
పెద్ద వారికేమో సకాలంలో
రూ.కోట్లల్లో చెల్లింపు
ప్రొటోకాల్ పాటించని ఏఈపై చర్యలేవీ..?
జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ


