పరిశ్రమల పేరిట.. పొలాలు లాక్కుంటారా..?
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి
వడ్డే శోభనాద్రీశ్వరరావు
కందుకూరు: పరిశ్రమల పేరుతో పచ్చని పొలాలను లాక్కోవడం దారుణమని.. వీటిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహార చెల్లింపులోను అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. రామాయపట్నంలో గురువారం పర్యటించిన ఆయన భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టం మేరకు రైతుల నుంచి భూమిని సేకరించాలంటే సబ్ రిజిస్ట్రార్ నిర్ణయించిన ధర ప్రామాణికంగా పరిహారాన్ని నాలుగురెట్లను చెల్లించాలని చెప్పారు. గ్రామసభలను నిర్వహించి రైతులు, రైతు కూలీలు, ఇతర వర్గాల ప్రయోజనాలు దెబ్బతినకుండా భూసేకరణ జరపాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ చట్టాన్ని సీఎం చంద్రబాబు సవరించి, పారిశ్రామికవేత్తలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఆమ్‌ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడారు. భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారని, దీని వల్ల దేశానికే తలమానికంగా ఉన్న ఉలవపాడు పరిసర ప్రాంతాల మామిడితోటలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోలార్ ప్రాజెక్టు కోసం భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని గ్రామాల రైతులు జేఏసీగా ఏర్పడి తమ అభిప్రాయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, కొద్ది మంది రాజకీయ నేతల మాటలు నమ్మి భూములను కోల్పోవద్దని సూచించారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి
నాడు అమరావతిలో ఏకపక్షంగా భూములను సేకరిస్తుంటే అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని, ఆపై విస్తృత స్థాయిలో చర్చించి సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్ పేర్కొన్నారు. రామాయపట్నంలో అమాయక ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా భూసేకరణ జరుగుతోందని ఆరోపించారు. పచ్చని చెట్లు పెంచండి అంటూ ఉపన్యాసాలిస్తూ.. మరోవైపు ప్రసిద్ధి గాంచిన మామిడితోటలను సీఎం నరికేయిస్తున్నారని విమర్శించారు. సీపీఐ మహిళా నేత అరుణ, రైతు నేతలు చుండూరి రంగారావు, సామాజిక ఉద్యమకారుడు వెంకటేశ్వర్లు, సీపీఐ నేతలు వీరారెడ్డి, పాలేటి కోటేశ్వరరావు, సురేష్ పాల్గొన్నారు.


