
యోగాపై ఆసక్తికి కృషి చేయాలి
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్: జిల్లాలోని ప్రజలందరికి యోగాపై ఆసక్తి కలిగించేలా జిల్లా స్థాయి అధికారులందరూ తమవంతు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపడుతున్న యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలను ముమ్మ రం చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి యోగా ప్రాధాన్యతను, ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు వివరించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో అధికారులు పాల్గొని ప్రజలను యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 200 మంది మాస్టర్ ట్రైనర్స్‌కు యోగాసనాలపై శిక్షణ పూర్తి చేశామని, వీరి ద్వారా గ్రామ స్థాయి, వార్డు స్థాయి వరకు ప్రజలను మమేకం చేసుకుంటూ యోగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా క్రీడాసాధికార సంస్థ అధికారి యతిరాజ్‌ను నోడల్ అధికారిగా నియమించామని, ఏవైనా సందేహాలు ఉంటే ఆయన్ను సంప్రదించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.