
ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కారం
● కలెక్టర్ ఆనంద్
నెల్లూరు రూరల్ : ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్, డీఆర్‌ఓ ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాల్ననారు. ప్రతి అర్జీని పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి అర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా నాణ్యమైన పరిష్కారం చూపించాలని, చూపించలేని సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో అర్జీదారులకు వివరించాలన్నారు.
విద్యానికేతన్ కళాశాలలో జేమ్స్ అనే విద్యార్థిని కొట్టి మూత్రం తాగించిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ మాల ఐక్యవేదిక నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ప్రజాసమస్యల పరిష్కారవేదికలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం మల్లాంలో ఓ వర్గం కులస్తులను చంపుతూ వారిని వెలివేయటాన్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మందపల్లిలో ఓ వర్గంపై ఎంగిలి విస్తరాకులు ఎత్తలేదని వారిని కొట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. పాకిస్తాన్ మత ఉగ్రవాదులను ఎప్పుడో ఒక్కసారి కాల్చిచంపుతున్నారని, కానీ భారతదేశంలో ఉన్న కుల ఉగ్రవాదులు ప్రతి రోజు అణగారిన వర్గాల వారిని చంపుతూ, అవమానాలకు గురిచేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ధర్నా చేస్తున్న మాల ఐక్యవేదిక నాయకులు

ప్రజలు సంతృప్తి చెందేలా పరిష్కారం