ప్రొటోకాల్‌ పాటించరా? | - | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ పాటించరా?

May 1 2025 12:09 AM | Updated on May 1 2025 12:09 AM

ప్రొట

ప్రొటోకాల్‌ పాటించరా?

నెల్లూరు(పొగతోట): ‘నెల్లూరు రూరల్‌ మండలంలో సౌత్‌మోపూరు పాఠశాలలో ప్రహరీ నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.16 లక్షలు కేటాయించాం. నిధులు కేటాయించిన నాకు ఆహ్వానం లేకుండా, ప్రొటోకాల్‌ పాటించకుండా గత నెల 29వ తేదీన ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ వ్యవహారం చూస్తుంటే సొమ్మొకరిది.. సోకొకరిది అనిపిస్తోంది. శంకుస్థాపన విషయం వివిధ పత్రికల్లో వచ్చాకే నాకు తెలిసింది’ అంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పంచాయతీ రాజ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నెల్లూరులోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ తాను సౌత్‌మోపూరుకు వెళ్లినప్పుడు పాఠశాల ఆవరణలోకి పశువులు, పందులు వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పారన్నారు. వారి విజ్ఞప్తి మేరకు ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. శంకుస్థాపన విషయంలో ప్రొటోకాల్‌ పాటించరా?, కనీసం సమాచారం కూడా ఇవ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ విషయంలో ఎన్ని పర్యాయాలు చెప్పినా అధికారుల్లో మార్పు రావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఆర్వో ఉదయ్‌భాస్కర్‌కు రాతపూర్వకంగా చైర్‌పర్సన్‌ ఫిర్యాదు చేశారు.

అందరినీ అవమానించినట్లే..

జెడ్పీటీసీ సభ్యులు కల్పించుని చైర్‌పర్సన్‌కు అవమానం జరిగితే అందరికీ జరిగినట్లేనని నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంగా సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తామని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ అశోక్‌కుమార్‌ని నిలదీశారు. ప్రొటోకాల్‌ విషయంలో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదంటూ సభ్యులందరూ నినాదాలు చేశారు. కలెక్టర్‌ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సమావేశం కొనసాగించారు. అంతకుముందు ఉగ్రదాడిలో చనిపోయిన వారికి, సంగం మాజీ జెడ్పీటీసీ ఇందూధర్‌రెడ్డి మరణానికి సంతాపంగా మౌనం పాటించారు.

అందుబాటులో ఉంచాలి

అరుణమ్మ మాట్లాడుతూ వచ్చే వ్యవసాయ సీజన్‌లో రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. వేసవి నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. చింతారెడ్డిపాళెం మెడికవర్‌ హాస్పిటల్‌ జంక్షన్‌ వద్ద అండర్‌పాస్‌ నిర్మాణానికి అనుమతుల మంజూరుకు చర్యలు చేపట్టిన తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. 24 నెలల నుంచి గౌరవ వేతనం మంజూరు చేయలేదంటూ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిలబడి నిరసన తెలిపారు. దీనిపై సీఈఓ విద్యారమ మాట్లాడుతూ చైర్‌పర్సన్‌ కమిషనర్‌తో మాట్లాడారని, సమస్య త్వరగా పరిష్కారమవుతుందని తెలిపారు. 1010 వరి పంట సాగు చేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనప్పుడు ఆ రకం విత్తనాలు సరఫరా చేయవద్దని కొందరు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వెంకటగిరి మండలంలో మహిళా ఎంపీటీసీ మూడు సమావేశాలకు హాజరుకాలేదని, దీనిపై ఎంపీడీఓకు సంజాయిషీ ఇచ్చినా ఆమెను సస్పెండ్‌ చేయాలని చూడటం సమంజసం కాదని నాయుడుపేట ఎంపీపీ ధనలక్ష్మి అరుణమ్మ దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్‌ చక్రవర్తి పలు అంశాలపై మాట్లాడారు. డీఆర్సీ, జనరల్‌బాడీ తదితర సమావేశాలకు తప్పనిసరిగా తిరుపతి జిల్లా నుంచి అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కావలి ప్రాంత జెడ్పీటీసీలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సంగం కాలువ, కావలి పెద్ద చెరువు పనుల నిమిత్తం రూ.65 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ పనులను త్వరగా పూర్తి చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా పరిషత్‌కు సంబంధించి బడ్జెట్‌ అంచనాలపై ఆమోదం తెలిపారు. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వచ్చి పది నిమిషాలు కూర్చొని చర్చించకుండా వెళ్లిపోయారు.

బడ్జెట్‌ ఇలా..

2024 – 25 సంవత్సరం సవరణ బడ్జెట్‌, 2025 – 26 సంవత్సరానికి సంబంధించి అంచనా బడ్జెట్‌ను సమావేశంలో పొందుపరిచారు. జిల్లా పరిషత్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇంజినీరింగ్‌ విభాగాల ఆదాయ, వ్యయం వారీగా బడ్జెట్‌ను తయారు చేశారు. 2023 – 24లో నికర ఆదాయం రూ.207,15,96,173, వ్యయం రూ.198,24,88,7 91, 2024 – 25లో ఆదాయం రూ.374,44,38,880, వ్యయం రూ.297,41, 48,290 అని డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు తెలిపారు. 2024 – 25లో సవరించిన బడ్జెట్‌లో ఆదాయం రూ.354,27,49,500, వ్యయం రూ.343,13,49, 900లుగా చూపించారు. 2025 – 26లో అంచనా బడ్జెట్‌ ఆదాయం రూ.379,80,03,800, వ్యయం రూ.368,93, 90,000లుగా వెల్లడించారు. మిగులు బడ్జెట్‌ రూ.10,86,13,800లుగా అంచనా తయారు చేశారు.

జెడ్పీ నిధులు మంజూరు చేస్తే

శంకుస్థాపనకు ఆహ్వానించరా?

సర్వసభ్య సమావేశంలో పీఆర్‌

అధికారులపై చైర్‌పర్సన్‌

ఆనం అరుణమ్మ ఆగ్రహం

సంబంధిత అధికారులపై చర్యలు

తీసుకోవాలని డిమాండ్‌

2024 – 25 సవరణ బడ్జెట్‌, 2025 – 26 అంచనా బడ్జెట్‌కు ఆమోదం

సమావేశానికి హాజరుకాని మంత్రులు, శాసనసభ్యులు

ప్రొటోకాల్‌ పాటించరా?1
1/1

ప్రొటోకాల్‌ పాటించరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement