● రూ.25 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం
తిరుపతి క్రైమ్: జిల్లాలో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. పోలీసుల కథనం.. జిల్లా పరిధిలోని తిరుపతి రూరల్, చంద్రగిరి, అలిపిరి, రేణిగుంట, నారాయణవనం, వెంకటగిరి, చిత్తూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తమిళనాడుకు చెందిన మహేష్ మణికంఠ, వెస్ట్ గోదావరికి చెందిన షేక్ అలీమొహిద్దీన్ దొంగతనాలకు పాల్పడేవారు. వీరిపై ఆయా పోలీస్ స్టేషన్లలో 11 కేసులు నమోదయ్యాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో తచ్చాడుతుండగా గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయి మహేష్ మణికంఠపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50కి పైగా కేసులున్నాయి. అదేవిధంగా షేక్ అలీమొహిద్దీన్‌పై 40కి పైగా కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. వీరు రెక్కీ నిర్వహించి దోపిడీలకు పాల్పడేవారు. అదేవిధంగా తాళం వేసి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. రూ.25 లక్షల విలువ చేసే 400 గ్రాముల బంగారు, 2.25 కిలోల వెండి, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు మంజూరు చేస్తామని డీఎస్పీ తెలిపారు.