పొగాకు ధరల పరుగు.. | - | Sakshi
Sakshi News home page

పొగాకు ధరల పరుగు..

May 16 2024 1:35 PM | Updated on May 16 2024 1:35 PM

డీసీపల్లిలో 910 పొగాకు బేళ్ల విక్రయం

సరాసరిన రూ.238 వద్ద కొనుగోళ్లు

కిలో గరిష్ట ధర రూ.300

130 మిలియన్‌ కిలోలకు అనుమతి

ఇప్పటికే 42 మిలియన్‌

కిలోల కొనుగోళ్లు పూర్తి

వరుసగా మూడో ఏడాదీ

రైతులకు లాభాల పంట

ఎకరానికి రూ.లక్ష లాభం

ప్లాట్‌ఫారం పేరు పొగాకు / సరాసరి ధర

మిలియన్ల

కిలోలు

కందుకూరు – 1 5.06 రూ.240.12

కందుకూరు – 2 4.65 రూ.241.04

కలిగిరి 2.81 రూ.239.73

డీసీపల్లి 4.05 రూ.243.12

చీమకుర్తి: పొగాకు రైతుల పంట పండింది. వరుసగా మూడో ఏడాదీ పొగాకుకు ఆశించిన ధర కంటే ఎక్కువగా రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పొగాకు కొనుగోళ్లు ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రారంభం కాగా, మొదటి రోజే కిలో పొగాకు ధర రూ.230 పలికింది. గరిష్ట ధర కిలో రూ.300 వరకు, సరాసరి ధర రూ.238.78 పలికిందని పొగాకు బోర్డు అధికారులు ధ్రువీకరించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 11 వేలం కేంద్రాలు ఉండగా, వీటి పరిధిలో ఈ ఏడాది 72 వేల హెక్టార్లలో పొగాకును రైతులు సాగు చేశారు. 130 మిలియన్‌ కిలోల పొగాకును కొనుగోలు చేసేందుకు బోర్డు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 11 వేలం కేంద్రాల్లో 42 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యాయి. బ్రైట్‌ కలర్‌ పొగాకే కాకుండా పచ్చ, మాడు రంగులో ఉన్న పొగాకు కిలో ధర సరాసరిన రూ.250 పలుకుతోంది. దీంతో రైతుల వద్ద నాణ్యమైన పొగాకుతో పాటు మాడు, పచ్చ వంటి లోగ్రేడ్‌ పొగాకు కూడా మిగలకుండా బయ్యర్లు కొనుగోలు చేస్తున్నారు. వరుసగా మూ డో ఏడాదీ పొగాకు రైతులు లాభాల బాట పట్టారు.

నాలుగు వేల హెక్టార్లలో సాగు అదనం

జిల్లాలోని కందుకూరులో రెండు, డీసీపల్లి, కలిగిరిలో వేలం కేంద్రాలున్నాయి. ఈ వేలం కేంద్రాల పరిధిలో 2022 – 23 పొగాకు సీజన్లో వేలంలో రికార్డు ధరలొచ్చాయి. కిలో పొగాకుకు సరాసరిన రూ.214 వరకు పలికింది. ఈ నేపథ్యంలో 2023 – 24లోనూ పొగాకు భారీగా సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే రెండు జిల్లాల్లోని 11 వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 72 వేల హెక్టార్లలో పొగాకు పంట సాగైంది. 2022 – 23లో 68 వేల హెక్టార్లలో సాగైతే, ప్రస్తుతం ఇది 72 వేల హెక్టార్లకు పెరిగింది.

ఎకరాకు రూ.లక్షపైనే లాభం

ఈ ఏడాది 72 వేల హెక్టార్లలో 23,930 బ్యారన్ల ద్వారా 30 వేల మంది రైతులు పొగాకును సాగు చేశారని అంచనా. ఒక్కో రైతు తన సొంత బ్యారన్‌తో పాటు మరో రెండు, మూడు బ్యారన్లను అద్దెకు తీసుకొని పొగాకు సాగు చేశారు. ప్రస్తుతం ఒక్కో ఎకరానికి రూ.లక్షకు తగ్గకుండా లాభాలొస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. నాణ్యత బాగుండటంతో లాభాలపై రైతులు మరింత ఆశలు పెట్టుకున్నారు. క్యూరింగ్‌లో దాదాపు 70 శాతం పొగాకు బ్రైట్‌ గ్రేడ్‌ దిగుబడి వస్తుండగా, 20 శాతం వరకు లోగ్రేడ్‌, మిగిలినవి ఇతర గ్రేడ్లు వస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

పొగాకు సాగు రైతులకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సీజన్లో ప్రారంభ దశలోనే మంచి ధరలు రావడంతో రైతులు లాభాల బాట పడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో పాటు స్థానికంగా వ్యాపారులు పోటీ పడుతుండటం రైతులకు కలిసొస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నాణ్యత మెరుగ్గా ఉండటంతో ఈ సీజన్‌లో ప్రారంభ ధర రూ.230 పలకగా, అత్యధికంగా రూ.300 వరకు చేరింది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రీజియన్‌ పరిధిలో ప్రస్తుతం 42 మిలియన్‌ కిలోల కొనుగోళ్లు పూర్తయ్యాయి. గత రెండు సీజన్లలో రైతులకు మంచి రేట్లు రావడంతో ఈ ఏడాది సాగు విస్తీర్ణం నాలుగు వేల హెక్టార్లు పెరిగింది.

సరాసరి ధర రూ.238.78 పలికింది

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన కొనుగోళ్లలో కిలో పొగాకు సరాసరి ధర రూ.238.78 పలికింది. కనిష్ట ధర రూ.205.. గరిష్ట ధర రూ.300, ప్రారంభ ధర రూ.230 పలికింది. 130 మిలియన్‌ కిలోలను కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించగా, ఇప్పటి వరకు 42 మిలియన్‌ కిలోల పొగాకును కొనుగోలు చేశారు. కొనుగోళ్లు ఆగస్ట్‌ వరకు కొనసాగనున్నాయి.

– లక్ష్మణ్‌రావు, ఆర్‌ఎం,

టుబాకో బోర్డు, ఒంగోలు

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 910 బేళ్లను బుధవారం విక్రయించారని నిర్వహణాధికారి రాజశేఖర్‌ తెలిపారు. వేలానికి 963 బేళ్లు రాగా, వీటిలో 910 విక్రయమయ్యాయని చెప్పారు. మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని తెలిపారు. వేలంలో 11,15,242 కిలోల పొగాకును విక్రయించగా, రూ.31,75,4751 మేర వ్యాపారం జరిగిందని పేర్కొన్నారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.299.. కనిష్ట ధర రూ.205.. సగటు ధర రూ.275.55గా నమోదైందని చెప్పారు. వేలంలో 18 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారన్నారు.

కిలో పొగాకు గరిష్ట ధర రూ.300

కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.300 లభించింది. సాధారణ క్లస్టర్‌కు చెందిన రైతులు 455 బేళ్లను తీసుకురాగా, 433 విక్రయమయ్యాయి. 22 బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి మహేష్‌కుమార్‌ మాట్లాడారు. కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.300.. కనిష్ట ధర రూ.205.. సరాసరిగా రూ.270.08 లభించిందని వివరించారు. వేలంలో 14 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement