
మాట్లాడుతున్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి
● అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే రామిరెడ్డి
కావలి: ‘కావలి నియోజకవర్గంలో 47 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాలకు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారి కావలి – తుమ్మలపెంట రోడ్డు. ఈ పనులు చేపట్టాలి.’ అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని ప్రధానమైన సమస్యలను ఎమ్మెల్యే గురువారం అసెంబ్లీలో వివరించి పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో ట్రంక్‌రోడ్డు విస్తరణకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.55 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కావలి పట్టణంలోని పెద్ద చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పెద్దపవని రోడ్డులో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పూర్తి చేస్తే నియోజకవర్గంలో 15,000 మంది మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సీఎం చేతుల మీదుగా హార్బర్‌ను ప్రారంభింపజేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలను మంత్రులకు తెలియజేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.