
ఓర్వలేక కక్షసాధింపు చర్యలు
● మర్రిగుంట రేషన్ డీలర్ ఆవేదన
కొండాపురం: తన ఇంట్లో రేషన్ దుకాణం ఉండటాన్ని ఓర్చుకోలేని కొందరు టీడీపీ నేతలు తన కుటుంబంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కొండాపురం మండలంలోని మర్రిగుంట గ్రామ డీలర్ సురేష్, సర్పంచ్ గోపీ ఆరోపించారు. మండలంలోని మర్రిగుంటలో విలేకరుల సమావేశంలో బుధవారం వారు మాట్లాడారు. మర్రిగుంట మీదుగా వెళ్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని స్థానిక సీతారాముల ఆలయం వద్ద గ్రామస్తులు శనివారం అర్ధరాత్రి అడ్డుకున్నారని చెప్పారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారని, అయితే రాజకీయ నేతలు ఒత్తిడి తెచ్చి ఎలాంటి సంబంధంలేని తనపై కలిగిరి ఎస్సైతో కేసు నమోదు చేయించారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారుల పంచనామా, రిపోర్ట్ పోలీసులకు ఇవ్వకుండా తనపై ఎలాంటి నేర నిరూపణ లేకుండానే కేసు నమోదు చేశారని వాపోయారు. మండలంలోని టీడీపీ నేతలు వెనుక నుంచి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ తన రేషన్ దుకాణంపై అధికారులు పలుమార్లు దాడులు నిర్వహించినా, ఎలాంటి లోటుపాట్లను కనుగొనలేదని చెప్పారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు తమపై లేనిపోనివి గ్రామానికి చెందిన కొందరు చెప్పి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని గోపీ ఆవేదన వ్యక్తం చేశాడు. దళిత కుటుంబం రాజకీయంగా ఎదగడం ఇష్టంలేని వారు అనేక కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరారు.