
పది పరీక్షలకు 380 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు బుధవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 380 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంగ్లిష్ పరీక్షకు 966 మంది హాజరు కావాల్సి ఉండగా 586 మంది హాజరయ్యారు.
సింహవాహనంపై కామాక్షితాయి
బుచ్చిరెడ్డిపాళెంరూరల్: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి, అమ్మవారు సింహవాహనంపై విహరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
24న ఐటీఐ
కళాశాలలో జాబ్‌మేళా
నెల్లూరు (పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న నెల్లూరు వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్‌ఖయ్యూమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీ యాజమాన్యాలు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 9494456326 నంబరులో సంప్రదించాలని కోరారు.
డీసీపల్లిలో 228
పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 228 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ తెలిపారు. వేలానికి 306 బేళ్లు రాగా 228 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 28189.4 కిలోల పొగాకును విక్రయించగా రూ.6959592.10 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.200, సగటు ధర రూ.246.89 లభించింది. వేలంలో 10 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్పత్తులకు
ఆన్‌లైన్ మార్కెటింగ్
నెల్లూరు (పొగతోట): జిల్లాలో స్వయం సహాయక గ్రూపు మహిళలు చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు ఆన్‌లైన్ మార్కెటింగ్ కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. బుధవారం డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో మహిళా సంఘాలకు ఉత్పత్తులు, మార్కెట్, ప్యాకింగ్ తదితర అంశాలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. వినియోగదారులు ఆకర్షితులయ్యేలా ప్యాకింగ్, లేబుల్‌ను డిజైన్ చేయాలని తెలిపారు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో వేగవంతంగా ముందుకు దూసుకుపోయేలా చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీఆర్‌ఐ డైరెక్టర్ స్వర్ణ, అసిస్టెంట్ బాలు, డీపీఎం భానుప్రసాద్, నాగేంద్రప్రసాద్, ఎం.కిరణ్, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.
వీఆర్వోలకు
ఉద్యోగోన్నతులు కల్పించండి
నెల్లూరు(అర్బన్): గ్రేడ్ –1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ కల్పించేందుకు అవసరమైన సీనియారిటీ జాబితాను త్వరితగతిన తయారు చేయాలని వీఆర్వో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పంటా అశోక్‌కుమార్‌రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు. పలువురు వీఆర్వోలతో కలిసి బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్వో ఉదయభాస్కర్‌రావుకు వినతి పత్రం ఇచ్చారు. పంటా అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో గ్రేడ్ –2 వీఆర్వోలుగా చేరిన వారికి కూడా గ్రేడ్–1 వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని కోరారు. వీఆర్వోలకు రేషనలైజేషన్‌పై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి రమణయ్య, నాయకులు రవి, శేఖర్, కృష్ణారావు, పెంచలరావు, జనార్దన్, శరవణ్, మునిబాబు, జగదీష్, విష్ణు, అశోక్, అనిల్ పాల్గొన్నారు.

పది పరీక్షలకు 380 మంది గైర్హాజరు