
విధులకు రావద్దంటూ టీడీపీ నేతల బెదిరింపులు
● గ్రీన్ అంబాసిడర్ ఆవేదన
కొండాపురం: తాను గ్రీన్ అంబాసిడర్‌గా పని చేస్తుంటే.. ఇక నుంచి విధులకు రావద్దంటూ కొందరు టీడీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి కొండమ్మ బెదిరిస్తున్నట్లు మండలంలోని పార్లపల్లి గ్రామానికి చెందిన చిట్టేటి ఆదినారాయణ వాపోయాడు. బుధవారం ఆయన పార్లపల్లిలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను ఐదేళ్లుగా గ్రీన్ అంబాసిడర్‌గా పని చేస్తున్నట్లు తెలిపాడు. ఇటీవల ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రామానికి వచ్చిన సమయంలో కొందరు టీడీపీ నాయకులు తమను వైఎస్సార్‌సీపీ వాళ్లమని, విధులకు రావద్దని బెదిరించారన్నారు. పోలీసులతో సచివాలయ ప్రాంగణం నుంచి బయటకు నెట్టివేయించారన్నారు. రెండేళ్లుగా జీతం రాకపోయినా చెత్త సేకరించే పనిచేస్తున్నాని, తనకు రావాల్సిన జీతం ఇచ్చిన తరువాత తీసివేయండని అడగ్గా, ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోరా.. అంటూ అగౌరవంగా కించపరుస్తూ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి కూడా పనికి రావద్దని, మీకు దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పారన్నారు. అట్రాసిటీ కేసు పెట్టినా తీసుకునే వాళ్లు లేరని హేళన చేశారన్నారు. ఎమ్మెల్యే కలిగిరి సీఐ, కొండాపురం పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో మరుసటి రోజు తమ గ్రామానికి చెందిన సుమారు 30 మంది టీడీపీ నాయకులు తమ కుటుంబ సభ్యులు ఏడుగురిపై తప్పుడు కేసులు పెట్టించారని వాపోయారు. తమను బెదిరించిన వారిపై కేసు ఇచ్చేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు తీసుకోమని హెడ్‌కానిస్టేబుల్ రమేష్ చెప్పారన్నారు.