
కూటమి అరాచకాలకు మూల్యం తప్పదు
కోవూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు స్వస్తి పలకకపోతే, భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కోవూరు నియోజకవర్గం లీగల్ సెల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెంచురెడ్డి, జి. శ్యామాచార్యులు హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు చెప్పారని అడ్డంగా పనిచేసే అధికారులు, పోలీసులూ శిక్ష అనుభవించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో లీగల్ సెల్ కమిటీ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించింది. వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పాలనపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు. ప్రశ్నించే వారిపైనా, అమాయకులపైనా అక్రమ కేసులు బనాయించే కొత్త సంస్కృతికి కూటమి ప్రభుత్వం తెరతీసిందన్నారు. వైఎస్సార్‌సీపీ క్యాడర్‌ను భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడేవారు లేరన్నారు. అభిమానులు, కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించినా, దాడులకు పాల్పడినా, ఆస్తులు ధ్వంసం చేసినా ఇకపై చూస్తూ వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఊరుకోదని హెచ్చరించారు. పార్టీ కేడర్‌కు లీగల్ అండగా నిలబడి, కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఇక నుంచి లీగల్ సెల్ టీమ్ క్రియాశీలకంగా పనిచేస్తుందని, ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో లీగల్ టీమ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అధికారులు కూడా వారి విధులు వారు చేసుకోవాలే తప్ప పచ్చ కండువాలు కప్పుకుంటే రాబోయే రోజుల్లో కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. కొందరు అమాయకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వాంగ్మూలం తీసుకుని సంబంధం లేని వారిని అక్రమ కేసుల్లో ఇరికిస్తున్న పోలీసులకు చట్టపరంగా శిక్ష తప్పదన్నారు.ఇప్పటికే కొందరు నిజాయితీ, నిక్కచ్చి కలిగిన అధికారులు పక్కకు తప్పుకుంటున్నారని చెప్పారు.
ఏడాది పాలన దగా
ఏడాది కూటమి పాలనలో అడుగుడుగునా దగా, దౌర్జన్యాలు, ప్రకృతి సంపద దోపిడీలు, అక్రమాలు, అవినీతి పెరిగాయన్నారు. ప్రతి వ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో నేర ప్రవృత్తి పెరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం మత్తులో హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దళితులపై దాడులు మితిమీరాయన్నారు. ప్రజలు ప్రతిక్షణంలో అభద్రతలో జీవిస్తున్నారన్నారు. గతంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలు, ఆడపిల్లల భద్రత కోసం దిశ యాప్ తెస్తే దాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్‌కుమార్‌రెడ్డి, నాయవాదులు మల్లికార్జున, బాలకృష్ణ, శ్రీనివాసులురెడ్డి, చందు, రాజేష్, నాయకులు సుధాకర్‌రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ క్యాడర్‌కు అండగా లీగల్ సెల్
తప్పు చేసే అధికారులు, పోలీసులూ జాగ్రత్త
కోవూరు అధ్యక్ష, ప్రధాన
కార్యదర్శులు చెంచురెడ్డి, శ్యామాచార్యులు