
స్కెచ్చేసి.. ఆపై కంచె వేసి
మనుబోలు: అడ్డగోలుగా దోచుకునేందుకు అలవాటుపడిన కొందరు కేటుగాళ్లు ఎక్కడ ఖరీదైన భూములుంటే అక్కడ గద్దల్లా వాలిపోయి కబ్జాలకు తెరదీస్తున్నారు. తాజాగా వీరి కన్ను మనుబోలు మండలంలోని జాతీయ రహదారి పక్కనున్న ప్రభుత్వ భూములపై పడింది. మండలంలో పది కిలోమీటర్లకుపైగా జాతీయ రహదారి విస్తరించి ఉంది. హైవేకు ఇరువైపులా ఖరీదైన ప్రైవేట్, ప్రభుత్వ భూములున్నాయి. కాగితాలపూరు క్రాస్ వద్ద గల దాబా నుంచి ఉత్తరం వైపు హైవేకు.. రైల్వే లైన్‌కూ మధ్య సర్వే నంబర్లు 434 – 2, 3, 4, 5, 6, 7, 8, 9, 13, 434 – ఏలో సుమారు 33 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు చెప్తుండగా, ఒక చోట సుమారు నాలుగెకరాల్లో కంచెను గుర్తుతెలియని వ్యక్తులు వేశారు. దీని విలువ సుమారు రూ.పది కోట్లకుపైగా ఉంటుంది. ఈ భూములను నుడాకు కేటాయిస్తున్నామని తహసీల్దారే చెప్పారు.
అధికార పార్టీ నేత అండతోనే..
నిత్యం రద్దీగా ఉండే హైవే పక్కన ఇంత దూరం కంచె వేస్తుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు అభ్యంతరం తెలపలేదనే అంశం మిస్టరీగా మారింది. అధికార పార్టీ నేత అండతో రెవెన్యూ వారికి తెలిసే ఈ కంచె వేశారని స్థానికులు పేర్కొంటున్నారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఖరీదైన భూములను కొట్టేసేందుకు పథకం పన్నారని, ఇందులో భాగంగానే కంచె వేశారని ఆరోపిస్తున్నారు. కాగా ఇందులో 434 – ఏ సర్వే నంబర్‌లోని 4.28 ఎకరాలు ఎర్రా పవిత్ర పేరుతో ఉంది. ఉన్నతాధికారులు స్పందించి కంచె వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని ప్రజలు కోరుతున్నారు.
అదంతా ప్రభుత్వ భూమే
ఈ భూములన్నీ ప్రభుత్వానివే. సుమారు 33 ఎకరాలను నుడాకు అప్పగించేందుకు సిద్ధం చేశాం. ఈ భూముల మధ్యలో ఫెన్సింగ్ వేసిన విషయం వాస్తవమే. అయితే అది ఎవరేశారు.. ఎందుకేశారో తెలియదు.
– వెంకటసుబ్బయ్య,
తహసీల్దార్
భూముల కబ్జాకు యత్నిస్తున్నా పట్టించుకోని అధికారులు
హైవేను ఆనుకున్న
నాలుగెకరాలపై కన్ను

స్కెచ్చేసి.. ఆపై కంచె వేసి