
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
● అసెంబ్లీలో కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట
కందుకూరు: ‘భూముల రీ సర్వే చేపట్టడం అభినందనీయం. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.’ అని కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రశంసించారు. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రీ సర్వేలో ప్రస్తుతం ఎవరైతే భూములు కలిగి ఉన్నారో వారి పేరునే కొనసాగించాలని, వారినే శాశ్వత హక్కుదారులుగా కొనసాగించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కందుకూరు ప్రాంతంలో యానాదులకు భూములు ఇచ్చారన్నారు. వారు వలసలు వెళ్లడంతో ఆ భూములను కొందరు ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ ఆక్రమణదారులకు పలువురు రెవెన్యూ అధికారులు కొమ్ముకాస్తూ రికార్డుల్లో పేర్లు నమోదు చేశారని వివరించారు. దీనిపై క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే నిషేధిత జాబితాలో ఉన్న వాగులు, వంకలు, పోరంబోకు భూములను కొందరు అధికారులు సబ్ డివిజన్లు చేసి రికార్డులో నమోదు చేశారన్నారు. వీటిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాళెం గ్రామస్తులు సర్వే నంబర్ 116లో 999 ఎకరాల భూములను రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. వాటికి సంబంధించి శాశ్వత హక్కులు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.