
ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో జింబాబ్వే పరాజయం
6 వికెట్లు తీసిన షోయబ్ బషీర్
నాటింగ్‌హామ్: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అదరగొట్టింది. జింబాబ్వేతో 22 ఏళ్ల తర్వాత ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... జింబాబ్వే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరు 30/2తో శనివారం మూడో రోజు ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే చివరకు 59 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది.
సీన్ విలియమ్స్ (82 బంతుల్లో 88; 16 ఫోర్లు), సికందర్ రజా (68 బంతుల్లో 60; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో పోరాడారు. ఈ జంట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మెరుగ్గా కనిపించిన జింబాబ్వే... ఇన్నింగ్స్ పరాజయం తప్పించుకునేలా అనిపించినా... ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి జింబాబ్వే ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ జంట మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది.
బెన్ కరన్ (37), వెస్లీ మధెవెరె (31) ఫర్వాలేదనిపించగా... కెప్టెన్ ఇర్విన్ (2), బెనెట్ (1), తఫద్జా (4), బ్లెస్సింగ్ ముజర్‌బానీ (4) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 6 వికెట్లతో సత్తా చాటాడు. అంతకు ముందు ఇంగ్లండ్ 565/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు తీసిన బషీర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.