
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత్ నుంచి సెమీస్ చేరిన తొలి మహిళా గ్రాండ్ మాస్టర్‌గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. హంపి సాధించిన అరుదైన ఘనత భారత్‌కు గర్వకారణమన్నారు.
యువ క్రీడాకారులకు హంపి స్ఫూర్తిదాయకమని.. ఆమె భవిష్యత్తులోనూ ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలనని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. కాగా మహిళల ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ (FIDE World Cup)లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.
యుజిన్ సాంగ్‌ను ఓడించి..
యుజిన్ సాంగ్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో హంపి 1.5–0.5తో గెలుపొందింది. శనివారం జరిగిన తొలి గేమ్‌లో నెగ్గిన హంపి... ఆదివారం జరిగిన రెండో గేమ్‌ను 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో చైనాకే చెందిన టింగ్‌జి లెతో హంపి తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో టింగ్‌జి లె 2–0తో నానా జాగ్‌నిద్జె (జార్జియా)పై గెలిచింది.
హారిక, దివ్య పోరు
మరోవైపు.. భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ వైశాలి పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. జోంగి టాన్ (చైనా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వైశాలి 0.5–1.5తో ఓడిపోయింది. శనివారం జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న వైశాలి... ఆదివారం జరిగిన రెండో గేమ్‌లో 88 ఎత్తుల్లో ఓటమి పాలైంది.

ఇక భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్ నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా నిలిచారు. దాంతో వీరిద్దరి మధ్య విజేత ఎవరో సోమవారం జరిగే టైబ్రేక్ గేమ్‌ల ద్వారా తేలుతుంది. వీరిద్దరి మధ్య ఆదివారం జరిగిన రెండో గేమ్ 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.
Congratulations to Grandmaster Koneru Humpy on becoming the first Indian woman to reach the FIDE Women’s Chess World Cup semifinal!
Your achievement is a proud moment for India and a true inspiration for young talent across the country. Wishing you continued success, more… pic.twitter.com/vwjfg8PoBn— YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2025