సచిన్‌ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్‌ చేస్తాడు: సునీల్ గవాస్కర్

Virat Kohli can get to 100 centuries if he can play for 5, 6 more years - Sakshi

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మరో అద్భుతమైన శతకంతో విరాట్‌ చెలరేగాడు.  అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు ఉండడం గమానార్హం.

కాగా కింగ్‌ కోహ్లికి ఇది 46వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్(49) అత్యధిక వన్డే సెంచరీల రికార్డుకు విరాట్‌ మరింత చేరువయ్యాడు. మరో నాలుగు సెంచరీలు ఈ రన్‌మిషన్‌ సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.

సచిన్‌ టెండూల్కర్ రికార్డును కోహ్లి ఎప్పుడు  బ్రేక్ చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌కు ముందు సచిన్‌ వన్డే సెంచరీల రికార్డును కింగ్‌ కోహ్లి బ్రేక్‌ చేస్తాడని గవాస్కర్ జోస్యం చెప్పాడు. అదే విధంగా విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడితే సచిన్‌ 100 సెంచరీల రికార్డును బద్దల కొట్టగలడని లిటిల్‌ మాస్టర్‌ అభిప్రాయపడ్డాడు.

"విరాట్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌కు ముందు భారత జట్టు న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేయడానికి కావల్సిన సెంచరీలు కేవలం మూడు మాత్రమే. కాబట్టి ఐపీఎల్‌కు ముందు సచిన్‌ వన్డే సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని నేను భావిస్తున్నాను. కోహ్లి విశ్రాంతి తీసుకుని వచ్చినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో సచిన్‌ పలు రికార్డులను కోహ్లి బ్రేక్‌ చేస్తడనడంలో ఎటువంటి సందేహం లేదని" గవాస్కర్ పేర్కొన్నాడు.

అదేవిధంగా సచిన్‌ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు గురించి సన్నీ మాట్లాడుతూ.. ఒక వేళ కోహ్లి మరో 5-6 ఏళ్ల పాటు క్రికెట్‌ ఆడితే కచ్చితంగా సచిన 100 సెంచరీల రికార్డును బ్రేక్‌ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు సగటున సంవత్సరానికి సెంచరీలు చేసినా సచిన్‌ను ఈజీగా అధిగమిస్తాడు.

అతడు తన వయస్సు 40 ఏళ్ల వచ్చే వరకు ఆడితే వచ్చే 5-6 సంవత్సరాలలో మరో 26 సెంచరీలు సాధించగలడు. సచిన్‌ కూడా 40 ఏళ్ల వరకు క్రికెట్‌ ఆడాడు. కోహ్లికి కూడా అద్భుతమైన ఫిట్‌నెస్‌ ఉంది. కాబట్టి విరాట్‌ సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఉంది అని అతడు అన్నాడు.
చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top