
తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు డి.సాయిలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు సంబంధం లేని వ్యక్తులు నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో తమ సంఘాన్ని కబ్జా చేశారని ఆరోపించారు. కోదాడకు చెందిన శ్రుతి అనే మహిళ తమ సంఘం పేరిట అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు.
తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘంతో సంబంధమే లేని ఆమె.. నకిలీ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి అక్రమంగా పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. గతంలో వేసిన అడ్‌హక్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న సుబ్రమణ్యం, వెంకటరమణ, హన్మంత్‌రాజ్‌తో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
సభ్యత్వమే లేని సంఘాలకు ఓటు హక్కు కల్పించి, సభ్యత్వం ఉన్న సంఘాల గుర్తింపు రద్దు చేశారని అన్నారు. నకిలీ సంఘాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శ్రుతి నడుపుతున్న సంఘంలో పోలీసు, ఐటీ, పోస్టల్ డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరిలో సగం మందికి వారు సభ్యులుగా ఉన్న విషయమే తెలీదని అన్నారు.
జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సంఘంలోని ఓ పెద్ద మనిషి, శాట్‌లోని ఓ డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ ఒలింపిక్ సంఘం మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ అండదండలతో శ్రుతి పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘం పేరిట శ్రుతి చేస్తున్న అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.