 
													Mitchel Marsh Comments On Batting At No. 3.. ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ తన బ్యాటింగ్ స్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మూడోస్థానంలో బ్యాటింగ్ అంటే చాలా ఇష్టమని.. అవకాశమిస్తే మాత్రం చెలరేగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి మార్ష్ ఇటీవలే వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ మూడోస్థానంలో వచ్చిన మార్ష్ 10 మ్యాచ్‌లాడి 375 పరుగులు చేశాడు. ఇక రాబోయే టి20 ప్రపంచకప్‌లో ఆసీస్ బ్యాటింగ్‌లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో మార్ష్ ప్రపంచకప్ సన్నాహాలపై ఇంటర్య్వూ చేసింది.
చదవండి: టీ20 వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
''టి20 ప్రపంచకప్ ప్రిపరేషన్ బాగానే ఉంది. జట్టు కోసం ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతా. కానీ మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వస్తే కొంచెం సౌకర్యంగా అనిపిస్తుంది. గత రెండు సిరీస్‌ల్లో ఇదే స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మంచి ప్రదర్శన కనబరిచా. గత కొన్ని నెలలుగా మంచి ఫామ్ కొనసాగిస్తున్నా.. రానున్న టి20 ప్రపంచకప్‌లోనూ అదే జోరును కొనసాగించాలని అనుకుంటున్నా. స్పెషల్ ప్లాన్స్ అంటూ ఏమిలేవు. ఇక నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడానికి స్పిన్నర్ల బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. మార్కస్ స్టోయినిస్ లాంటి ఆటగాళ్లు క్రీజులో ఉండి కొట్టే భారీషాట్లు నన్ను ఆకట్టుకుంటున్నాయి. క్రీజులోనే వెనక్కి జరిగి డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్‌లు కొట్టడం సూపర్‌గా అనిపిస్తుంది. ఇలాంటి షాట్స్ ఆడేందుకు నేనే ప్రయత్నిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మొదటి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 23న అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
చదవండి: T20 World Cup: అతడితో కలిసి ఓపెనింగ్ చేయడం ఖాయం: పాక్ కెప్టెన్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
