దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య! | Sri Lanka Official Found Dead-World Cup Winning Cricketer Aravinda De Silva Home | Sakshi
Sakshi News home page

దిగ్గజ క్రికెటర్ ఇంట్లో మాజీ అధికారి ఆత్మహత్య!

May 8 2026 5:05 PM | Updated on May 8 2026 7:10 PM

Sri Lanka Official Found Dead-World Cup Winning Cricketer Aravinda De Silva Home

శ్రీలంక దిగ్గ‌జ‌ క్రికెట‌ర్ అరవింద డి సిల్వా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న కపిల చంద్రసేన అరవింద డి సిల్వా ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. అర‌వింద డిసిల్వా భార్య అనుష్క డి సిల్వా, క‌పిల చంద్ర‌సేన భార్య ప్రియాంక నియోమ‌లి స్వ‌యానా అక్కా చెల్లెల్లు కావడం గమనార్హం.

విషయంలోకి వెళితే.. మే 7న (గురువారం) క‌పిల చంద్ర‌సేన కొల్లుపిటియాలోని పెడ్రిస్ ప్లేస్‌లో ఉన్న‌ అర‌వింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అరవింద డిసిల్వా ఇంట్లోని బెడ్‌రూమ్‌లో క‌పిల చంద్ర‌సేన నిర్జీవ స్థితిలో ప‌డి ఉన్నాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. అయితే మ‌ర‌ణానికి గ‌ల అస‌లు కార‌ణం పోస్టుమార్టం రిపోర్ట్‌లో బ‌య‌ట‌ప‌డ‌నుంది.

ఇటీవ‌లే చంద్ర‌సేన విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఒక కంపెనీ నుంచి 2 మిలియ‌న్ డాల‌ర్లు లంచం తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న మ‌ర‌ణించ‌డానికి ఒక్క‌రోజు ముందు కొలంబో ప్రధాన న్యాయ‌మూర్తి క‌పిల చంద్ర‌సేన‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దాన్ని త‌ప్పించ‌కునేందుకు అర‌వింద డిసిల్వా ఇంటికి వ‌చ్చారా లేక వేరే కార‌ణం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 

ఇక క‌పిల చంద్ర‌సేన మ‌ర‌ణ వార్త తెలియ‌గానే లంక మాజీ కెప్టెన్ అర్జున ర‌ణ‌తుంగ అర‌వింద డిసిల్వా నివాసానికి చేరుకున్నాడు. శ్రీలంక క్రికెట్‌లో మూల‌స్తంభాల్లో ఒకడిగా అర‌వింద డిసిల్వా గుర్తింపు పొందాడు. లంక జ‌ట్టు 1996 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెల‌వ‌డంలో అర‌వింద డిసిల్వాది కీల‌క‌పాత్ర‌ పోషించాడు. 

పాకిస్తాన్‌లోని లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన 1996 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్లో చేజింగ్‌లో అజేయ‌ సెంచ‌రీతో మెరిసిన డిసిల్వా త‌న జ‌ట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. 1984లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అర‌వింద డిసిల్వా లంక త‌ర‌ఫున 93 టెస్టులు, 308 వ‌న్డే మ్యాచ్‌లు ఆడాడు. 

రెండు ఫార్మాట్లు క‌లిపి 15వేల‌కు పైగా ప‌రుగులు సాధించిన అర‌వింద డిసిల్వా 31 సెంచ‌రీలు, 86 అర్థ‌సెంచ‌రీలు సాధించాడు. ఇక బౌలింగ్‌లోనూ డిసిల్వా రెండు ఫార్మాట్లు క‌లిపి 135 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2003 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సెమీస్‌లో శ్రీలంక ఓట‌మి అనంత‌రం అరవింద డిసిల్వా త‌న అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికాడు.

చదవండి: ఆర్సీబీ ఓట‌మి.. వ‌రుస ఓట‌ముల‌కు ల‌క్నో చెక్‌!

Advertisement
 
Advertisement
Advertisement