హ్యపీ బర్త్‌డే మిథాలీ రాజ్‌..

Special Story Of Leading Indian Women Cricketer Mithali Raj Birthday - Sakshi

భారత మహిళా క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ ఓ పెను సంచలనం. 1999లో ఉమెన్స్‌ క్రికెట్‌లోకి ప్రవేశించిన మిథాలీ రాజ్‌ ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి ఔరా అనిపించింది. ఐర్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 114 పరుగులు సాధించి అప్పటివరకు భారతదేశంలో క్రికెట్‌ అంటే పురుషులు మాత్రమే ఆడగలరు అని కామెంట్లు చేసిన వారికి గట్టి సమాధానం చెప్పింది. ఈ ప్రదర్శన తీసివేసేది కాదని కొద్ది రోజుల్లోనే  తెలిసేలా చేసింది. (చదవండి : 'క్రికెటర్‌ కాకపోయుంటే రైతు అయ్యేవాడు')

2002లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్‌ తరపున మొదటి డబుల్‌ సెంచరీ చేయడంతో పాటు.. 214 పరుగులు అత్యధిక స్కోరు నమోదు చేసి మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. అప్పటివరకు మహిళల క్రికెట్‌లో కారెన్‌ రోల్టన్‌ పేరిట  ఉన్న 209 పరుగులే అత్యధిక స్కోరుగా ఉండేది. మిథాలీ కేవలం మూడో టెస్టులోనే అత్యధిక పరుగుల రికార్డును తుడిచేయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

ఆ తర్వాత అనతికాలంలోనే మహిళల ఉమెన్స్‌ క్రికెట్‌లో టీమిండియా తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌వుమెన్‌గా రికార్డులకెక్కింది. వన్డేల్లో నంబర్‌వన్‌ బ్యాట్స్‌వుమెన్‌గా ధీర్ఘకాలికంగా కొనసాగిన మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. అంతేకాదు.. భారత పురుషుల క్రికెట్‌లో క్రికెట్‌ గాడ్‌గా పిలవబడే సచిన్‌ టెండూల్కర్‌ స్థాయిలోనే.. మహిళల క్రికెట్‌లో మిథాలీ లేడీ టెండూల్కర్‌గా కితాబులందుకుంది. అలాంటి మిథాలీ రాజ్ ఇవాళ(డిసెంబర్‌ 3) 38 పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఐసీసీ మిథాలీ రాజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్‌ వీడియోనూ రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా మిథాలీకి బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ ఆమె సాధించిన విజయాలు, పలు రికార్డులతో పాటు కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. (చదవండి : మ్యాచ్‌కు ముందు తండ్రి చనిపోయినా..)

రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో 1982 డిసెంబర్‌ 3న జన్మించిన మిథాలీ రాజ్‌ కుటుంబం నిజానికి తమిళనాడు వ్యాస్తవ్యులు. తండ్రి దొరై రాజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారి కావడంతో నిత్యం బదిలీలు జరిగేవి. తల్లి లీలారాజ్‌ గృహిణి. ఆ తర్వాత వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది.

మిథాలీ 10 ఏళ్ల వయసులోనే క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని కీస్‌ హై​స్కూల్‌లో 10 వ తరగతి వరకు చదివిన మిథాలీ సికింద్రాబాద్‌లోని కస్తూర్బా గాంధీ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసింది. ఇండియన్‌ రైల్వే క్రికెట్‌ తరపున తొలిసారి  డమొస్టిక్‌ క్రికెట్‌లో ఆడారు. అప్పుడే ఒకప్పటి స్టార్‌ మహిళా క్రికెటర్లు అయిన అంజుమ్‌ చోప్రా,  పూర్ణిమా రాహు, అంజు జైన్‌ పరిచయమయ్యారు.

1999లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా మిథాలీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. 

2005లో టీమిండియా ఉమెన్స్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మిథాలీ రెండు ప్రపంచకప్‌ల్లో(2005,2017) రెండు సార్లు భారతజట్టును ఫైనల్‌ చేర్చిన ఘనత సాధించింది.

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో భారత్‌ తరపున తొలిసారి 6వేల పరగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లు(వన్డే, టీ20, టెస్టులు) లీడింగ్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాదు.. వన్డేల్లో వరుసగా 7 అర్థసెంచరీలు సాధించడంతో పాటు వన్డేల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్‌గా రికార్డు సాధించింది.

ఇండియా నుంచి టీ20ల్లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి  బ్యాట్స్‌వుమెన్‌గా రికార్డు సృష్టించింది.

కాగా ఇప్పటివరకు మిథాలీ రాజ్‌ టీమిండియా మహిళల జట్టు తరపున 209 వన్డేల్లో 6888, 10 టెస్టుల్లో 663, 89 టీ20ల్లో 2,364 పరుగులు సాధించింది. ఇందులో వన్డేల్లో 53 అర్థసెంచరీలు, 7 సెంచరీలు ఉండగా.. టెస్టుల్లో 4 అర్థసెంచరీలు, ఒక సెంచరీ సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top