చైనాకు కొరియా షాక్‌ | South Korea Womens Team Wins Uber Cup Over China | Sakshi
Sakshi News home page

చైనాకు కొరియా షాక్‌

May 4 2026 6:08 AM | Updated on May 4 2026 6:08 AM

South Korea Womens Team Wins Uber Cup Over China

మూడోసారి ఉబెర్‌ కప్‌ సొంతం

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): నాలుగేళ్ల విరామం తర్వాత ప్రతిష్టాత్మక ఉబెర్‌ కప్‌ మహిళల టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ లో దక్షిణ కొరియా జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణ కొరియా 3–1తో 16 సార్లు చాంపియన్‌ చైనా జట్టును బోల్తా కొట్టించి మూడోసారి ఉబెర్‌ కప్‌ను సొంతం చేసుకుంది. 2010, 2022లలో కూడా చైనా జట్టునే ఓడించి దక్షిణ కొరియా జట్టు ఉబెర్‌ కప్‌ను దక్కించుకుంది. 

పదోసారి చైనా జట్టుతో టైటిల్‌ పోరులో తలపడ్డ కొరియా ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్, ఒలింపిక్‌ చాంపియన్‌ ఆన్‌ సె యంగ్‌ 21–10, 21–13తో ప్రపంచ 2వ ర్యాంకర్‌ వాంగ్‌ జి యిపై 20వ సారి గెలిచి కొరియాకు శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ జోడీ లియు షెంగ్‌ షు–టాన్‌ నింగ్‌ 21–15, 21–12తో జియోంగ్‌ నా యున్‌–లీ సో హీ జంటపై గెలిచి స్కోరును 1–1తో సమం చేసింది. 

మూడో మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్‌ కిమ్‌ గా యున్‌ 21–19, 21–15తో ప్రపంచ 4వ ర్యాంకర్‌ చెన్‌ యు ఫెను ఓడించి కొరియాకు 2–1తో ఆధిక్యం అందించింది. నాలుగో మ్యాచ్‌లో ప్రపంచ 170వ ర్యాంక్‌ జోడీ 16–21, 21–10, 21–13తో ప్రపంచ 4వ ర్యాంక్‌ ద్వయం జియా యి ఫాన్‌–జాంగ్‌ షు జియాన్‌ను కంగుతినిపించి కొరియాకు 3–1తో విజయాన్ని అందించింది. సెమీఫైనల్లో ఓడిన ఇండోనేసియా, జపాన్‌ జట్లకు కాంస్య పతకాలు లభించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement