ఉత్కంఠ పోరు.. చివరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిచిన సౌతాఫ్రికా | South Africa Women Beat New Zealand Women By 2 Wickets In 1st ODI Thriller, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

SA vs NZ: ఉత్కంఠ పోరు.. చివరి బంతికి సిక్స్‌ కొట్టి గెలిచిన సౌతాఫ్రికా

Mar 29 2026 3:15 PM | Updated on Mar 29 2026 4:48 PM

South Africa Women Beat New Zealand Women by 2 Wickets in 1st ODI Thriller

క్రైస్ట్‌చర్చ్ వేదిక‌గా న్యూజిలాండ్-ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డే అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ఆఖ‌రి వ‌ర‌కు నువ్వానేనా అన్న‌ట్లు సాగిన ఈ పోరులో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజ‌యం సాధించింది. ప్రోటీస్ విజ‌యంలో యువ ఆల్‌రౌడ‌ర్ కైలా రేనెకేది కీల‌క పాత్ర‌.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో  268 పరుగులకు ఆలౌట్ అయింది. టాపార్డ‌ర్ పెద్ద‌గా రాణించిక‌పోయిన‌ప్ప‌టికి.. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ మ్యాడీ గ్రీన్ మాత్రం 85 ప‌రుగుల‌తో స‌త్తాచాటింది. ఆమెతో పాటు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇసాబెల్లా గేజ్ 37 పరుగులతో రాణించింది. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో అయాబొంగా ఖాకా 6 వికెట్లు ప‌డగొట్టి కివీస్ వెన్ను విరిచింది. ఆమెతో పాటు ట్రయోన్ రెండు, తుమీ సెఖుఖునే, న‌డైన్ డిక్లార్క్ త‌లా వికెట్ సాధించారు.

అనంత‌రం 269 పరుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్లు బ్రిట్జ్‌(0), లారా వోల్వ‌డ‌ర్ట్‌(16) వ‌రుస ఓవ‌ర్ల‌లో పెవిలియ‌న్‌కు చేరారు. ఈ స‌మ‌యంలో అన్నేరీ డెర్క్‌సెన్( 72), సునే లూస్(53) త‌మ అద్భుత ఇన్నింగ్స్‌ల‌తో జ‌ట్టును ఆదుకున్నారు.

అయితే  వీరిద్ద‌రూ ఔట‌య్య‌క ప్రోటీస్ మ‌ళ్లీ క‌ష్టాల్లో ప‌డింది. ఈ క్ర‌మంలో న‌డైన్ డిక్లార్క్‌(39), కైలా రేనెకే(42) జ‌ట్టును గెలిపించే బాధ్య‌త‌ను త‌మ భుజాన వేసుకున్నారు. డిక్లార్క్ ఔటైన‌ప్ప‌టికి రేనెకే మాత్రం త‌న ప‌ట్టును వీడ‌లేదు. చివ‌రి ఓవ‌ర్‌లో ప్రోటీస్ విజ‌యానికి 14 ప‌రుగులు అవ‌స‌రమ‌య్యాయి. సుజీ బేట్స్ వేసిన ఈ ఓవ‌ర్‌లో తొలి రెండు బంతుల‌కు కేవ‌లం రెండు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాయి. 

దీంతో విజ‌య‌స‌మీక‌ర‌ణం 4 బంతుల్లో 12 ప‌రుగులగా మారింది. ఆ త‌ర్వాత మూడో బంతికి రేనెకే అద్భుత‌మైన సిక్స‌ర్ బాదింది. దీంతో మూడు బంతుల్లో 6 ప‌రుగులు అవ‌స‌ర‌మ‌య్యాయి. అయితే అనుహ్యంగా త‌ర్వాత రెండు బంతులకు ఎలాంటి ప‌రుగులు రాలేదు. దీంతో సౌతాఫ్రికా విజ‌యానికి ఆఖ‌రి బంతికి సిక్స్ అవ‌స‌ర‌మైంది. అయితే రేనెకే అద్భుత‌మైన సిక్స్ బాది ప్రోటీస్‌కు చిర‌స్మ‌రణీయ విజ‌యాన్ని అందించింది. రేనెకే ఇదే తొలి వ‌న్డే మ్యాచ్ కావ‌డం విశేషం.
చదవండి: RCB Vs SRH: ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం.. కోహ్లీ ఫ్లయింగ్‌ కిస్‌

Advertisement
 
Advertisement
Advertisement