అంపైర్‌ చీటింగ్‌.. అసలు అది ఔట్‌ కాదు

Shubman Gill Dismissal Controversy In Practice Match Against Australia A - Sakshi

సిడ్నీ : ఆస్ట్రేలియా -ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అవుటైన విధానం సోషల్‌ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అసలు అంపైర్‌ దేనిని పరిగణలోకి తీసుకొని గిల్‌ విషయంలో ఔట్‌ ఇచ్చాడో అర్థం కావడం లేదని నెటిజన్లు తలగోక్కున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఆసీస్‌ ఎతో మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులతో మంచి టచ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ను ఆసీస్‌ బౌలర్‌ మిచెల్‌ స్వేప్సన్‌ ఔట్‌ చేశాడు. అయితే స్వేప్సన్‌ వేసిన బంతి గిల్‌ ప్యాడ్లను తాగి స్లిప్‌లోకి వెళ్లింది.. స్లిప్‌లో ఉన్న సీన్‌ అబాట్‌ దాన్ని క్యాచ్‌గా అందుకున్నాడు. అప్పటికే స్వేప్సన్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ ఔట్‌ అని ప్రకటించాడు. కాగా స్కోరుబోర్డులో గిల్‌ క్యాచ్‌ అవుట్‌ అయినట్లుగా చూపించారు. (చదవండి : 'క్రికెటర్‌ కాకపోయుంటే రైతు అయ్యేవాడు')

అంపైర్‌ ఎల్బీ లేక క్యాచ్‌లో ఏది పరిగణలోకి తీసుకొని అవుట్‌గా ఇచ్చాడనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో షాక్‌ తిన్న గిల్‌ అసలు ఔటా.. కాదా అన్న సందేహంతో కాసేపు అక్కడే నిలుచుండిపోయాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కావడంతో డీఆర్‌ఎస్‌ అవకాశం లేకపోవడంతో గిల్‌ నిరాశగా వెళ్లిపోయాడు. వాస్తవానికి రీప్లేలో స్వేప్సన్‌ వేసిన బంతి గిల్‌ ప్యాడ్లను తాకి ఆఫ్‌స్టంట్‌ పై నుంచి వెళ్తున్నట్లు కనిపించింది.. దీంతో అతను ఎల్బీగా అవుట్‌ కాదు. ఇక బంతి బ్యాట్‌ను తాకకుండా కేవలం గిల్‌ ప్యాడ్లను మాత్రమే తాకి స్లిప్‌లో ఉన్న అబాట్‌ చేతుల్లో పడింది. అలా చూసినా గిల్‌ ఔట్‌ కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇది చీటింగ్‌ అసలు గిల్‌ ఔట్‌ కానే కాదు.. అది అంపైర్‌ తప్పుడు నిర్ణయం.. గిల్‌ నాటౌట్‌..  రాంగ్‌ అంపైరింగ్‌ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. 'శుబ్‌మన్‌ ఎలా అవుటయ్యాడో అంపైర్‌ చెప్పాలి.. కచ్చితంగా ఎల్బీ మాత్రం కాదు.. క్యాచ్‌ అవుటా అంటే ఆ చాన్సే లేదు..' అంటూ చురకలంటించాడు. (చదవండి : రషీద్‌ను దంచేసిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌)

ఇక ఆసీస్‌-ఎ, టీమిండియాల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 472 పరుగుల  భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌-ఎ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లలో జాక్‌ వైల్డర్‌ మత్‌ సెంచరీతో మెరవగా.. కెప్టెన్‌ అలెక్స్‌ కేరీ 58 పరుగులతో రాణించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దానిని రిపీట్‌ చేయలేకపోయారు.అంతకముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్‌ పంత్‌, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే.(చదవండి : పేడ మొహాలు, చెత్త గేమ్‌ప్లే అంటూ..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top