షాంఘై (చైనా): ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్‌లో భారత ఆటగాడు సాహిల్ జాదవ్ కాంస్యంతో మెరిశాడు. శనివారం పురుషుల కాంపౌండ్ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాదవ్ 147–144 స్కోరుతో మార్టీన్ డామ్సో (డెన్మార్క్)పై విజయం సాధించాడు. కాంపౌండ్‌లో భారత్‌కు లభించిన పతకం ఇదొక్కటే కావడం విశేషం. 25 ఏళ్ల సాహిల్ ప్రస్తుత వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ చాంపియన్ కూడా. డామ్సోతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఎండ్‌లో 29–30తో వెనుకబడిన సాహిల్, రెండో ఎండ్‌లో 27–30తో పైచేయి సాధించాడు.
ఆ తర్వాత 29–28, 30–29తో భారత ఆర్చర్ ముందంజ వేయగా... అప్పటికే నాలుగు పాయింట్లు వెనుకబడిన డామ్సో చివరి ఎండ్‌ను 30–29తో ముగించినా లాభం లేకపోయింది. జాదవ్ ఖాతాలో కాంస్య పతకం చేరింది. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్లో జాదవ్ 146–147 స్కోరుతో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ నికోలస్ గిరార్డ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయంపాలయ్యాడు. నేడు జరిగే మహిళల రికర్వ్ ఫైనల్ (టీమ్ ఈవెంట్)లో చైనాతో భారత్ తలపడనుండగా... వ్యక్తిగత విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ సెమీఫైనల్ బరిలోకి దిగుతుంది.


