IPL 2022: వ‌రుస‌గా ఆరు ఓట‌ములు.. పూర్తి బాధ్య‌త నాదే: రోహిత్ శర్మ

Rohit Sharma as MIs winless streak continues in IPL 2022 - Sakshi

ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్‌ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్‌లో పేలవ ప్రదర్శన కొన‌సాగిస్తోంది. ఐపీఎల్‌-2022లో ఇప్ప‌టి వ‌ర‌కు బోణి కొట్టని ముంబై.. వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసి పాయింట్ల ప‌ట్టిక‌లో అఖ‌రి  స్థానంలో నిలిచింది. ఇక శ‌నివారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోను 19 పరుగుల తేడాతో రోహిత్ సేన ప‌రాజయం పాలైంది.

కాగా మ్యాచ్ అనంత‌రం మాట్లాడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ .. ఈ ఏడాది సీజ‌న్‌లో వ‌రుస ప‌రాజ‌యాల‌కు త‌న‌దే పూర్తి బాధ్యతని  అన్నాడు. " పెద్ద‌ ల‌క్ష్యాన్ని ఛేదించేట‌ప్పుడు ఏ జ‌ట్టుకైన భారీ భాగస్వామ్యాలు అవసరం. ఈ మ్యాచ్‌లో భాగస్వామ్యాలు నెల‌కొల్ప‌డంలో మేము పూర్తి స్థాయిలో విఫ‌ల‌మ‌య్యాం. మా ఓట‌మికి ప్రత్యేక కారణం ఏమీ లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు మేము ఆరు మ్యాచ్‌లు ఓడిపోయాం. సరైన జట్టు కూర్పు గురించి ఆలోచిస్తున్నాం. అయితే ఓటములు ఎదురైన‌ప్పుడు జ‌ట్టులో త‌ప్పులు వెత‌క‌డం సహాజ‌మే. కానీ ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత్యుత్తుమ ప్లేయింగ్ ఎలెవ‌న్‌తో బ‌రిలోకి దిగుతున్నాం. కానీ త‌ప్పు ఎక్క‌డ జ‌రుగుతుందో తెలియ‌డం లేదు. 

ఇక జ‌ట్టును విజ‌యాల బాట‌లో నడిపించలేకపోతున్నందుకు నాదే పూర్తి బాధ్యత. నాకు నేను మ‌ద్ద‌తుగా ఉంటూ నా ఆట‌ను ఆస్వాదిస్తాను. కాగా ఈ సీజ‌న్ ఇంకా ముగిసిపోలేదు. ఇప్ప‌టికి మేము పోటీలో ఉన్నాం అని భావిస్తున్నాను. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల నుంచి పుంజుకున్నాం. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం" అని రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top