Rohit Sharma: అతడి ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరిస్తాం.. అయితే, అనవసర షాట్లు వద్దని చెప్పాం: రోహిత్‌ శర్మ

Rohit Sharma Backs Rishabh Pant What Comes With Him Ready To Accept - Sakshi

Ind VS Sl: Rohit Sharma Comments- టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. అరగంటలో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగల సత్తా ఉన్నవాడని ఆకాశానికెత్తాడు. రోజురోజుకూ అతడు ఎదుగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. కాగా శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో పంత్‌ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.

మొహాలీ వేదికగా జరిగిన మొదటి టెస్టులో 97 బంతుల్లో 96 పరుగుల చేసిన పంత్‌.. రెండో టెస్టులో వరుసగా 39, 50 పరుగులు సాధించాడు.  తద్వారా 120.12 స్ట్రైక్‌రేట్‌తో సిరీస్‌లో 185 పరుగులు చేసిన పంత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 

ఈ నేపథ్యంలో బెంగళూరు టెస్టు విజయానంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. పంత్‌కు దూకుడుగా ఆడే స్వేచ్ఛనిచ్చామని తెలిపాడు. అయితే అదే సమయంలో జట్టు గేమ్‌ ప్లాన్‌కు తగ్గట్టుగా పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించామన్నాడు. ఈ మేరకు.. ‘‘పంత్‌ బ్యాటర్‌గా ఎలా ఉంటాడో.. జట్టుకు ఆడుతున్నపుడు బ్యాటింగ్‌ ఎలా ఉంటుందో మాకు తెలుసు. 

తనకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇచ్చాం. అయితే, కొన్ని పరిస్థితుల్లో అనవసరపు షాట్ల వల్ల అవుట్‌ కావడం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా వివరించాం. గేమ్‌ప్లాన్‌ అమలులో తేడాలు రాకుండా చూసుకోవాలని చెప్పాం.

అరె ఈ షాట్‌ ఎందుకు ఆడామని పశ్చాత్తాపపడే పరిస్థితి రాకూడదని చెప్పాం. అరగంట లేదంటే 40 నిమిషాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా అతడి సొంతం. అందుకే తన ఆట తీరు ఎలా ఉన్నా స్వీకరించే స్థితిలో ఉన్నాం’’ అని రోహిత్‌ శర్మ పంత్‌కు మద్దతుగా నిలిచాడు. 

చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top