
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా కొత్త కెప్టెన్ నియామకం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ (Rohit Sharma) నిష్క్రమణ నేపథ్యంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)కు పగ్గాలు అప్పగించేందుకు బోర్డు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. అతడికి డిప్యూటీగా మరో యువ ఆటగాడినే ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఈసారి కనీసం ఫైనల్ చేరకుండానే
గతేడాది టెస్టుల్లో పరాభవాల పాలైన టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు దూరమైన విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచిపోయిన భారత్.. ఈసారి ఆలోటు తీర్చుకుంటుందనుకుంటే ఇలా మొత్తానికే మోసం వచ్చింది.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల్లో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)-2025లో 3-1తో ఓడటం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ రెండు సందర్భాల్లోనూ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రోహిత్ శర్మ బుధవారమే సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.
విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే!
ఈ క్రమంలో మరో సీనియర్ బ్యాటర్, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే నడుస్తాడనే వార్తలు వినిపించాయి. కోహ్లి ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నా.. బోర్డు అందుకు సమ్మతించలేదని.. అందుకే అతడు ఈ మేర తీవ్ర నిర్ణయానికి వచ్చినట్లు వదంతులు వ్యాపించాయి.
వైస్ కెప్టెన్‌గా పంత్
డబ్ల్యూటీసీ 2025-27 కొత్త సీజన్‌లో యువ రక్తంతో నిండిన జట్టును ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనే యోచనలో ఉన్న బోర్డు.. కోహ్లికి నో చెప్పిందన్నది వాటి సారాంశం. తాజా సమాచారం ప్రకారం.. శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. మే ఆఖరి వారంలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించాలని సెలక్టర్లు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి గిల్ కంటే పంత్ సీనియర్. అంతేకాదు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి విదేశీ గడ్డలపై సమర్థవంతంగా ఆడిన అనుభవం అతడికి ఉంది.
అయితే, ఇటీవల ఆసీస్ పర్యటనలో పంత్ పూర్తిగా విఫలమయ్యాడు. షాట్ల ఎంపిక విషయంలో పదే పదే తప్పులు చేస్తూ విమర్శల పాలయ్యాడు. ఇలాంటి తరుణంలో గిల్ వైపు మొగ్గు చూపిన యాజమాన్యం.. అతడి చుట్టూ భవిష్యత్ జట్టును నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే పంత్‌పై అదనపు భారం మోపకుండా.. బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టేలా బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టులతో డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ఆరంభం కానుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఇంగ్లండ్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతుంది.