
జై షా- పృథ్వీ షా
Prithvi Shaw 379- Jay Shah: ‘‘రికార్డుల గురించి నేను ఆలోచించలేదు. ముందురోజు 240 పరుగులు చేశాను. తర్వాతి రోజు మళ్లీ సున్నానే నుంచే మొదలుపెట్టాననుకున్నా. పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం నాకు అలవాటు. నిజానికి డ్రెస్సింగ్‌రూంలోకి వచ్చిన తర్వాతే రంజీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించానని తెలిసింది’’ అని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు.
నాతో మాట్లాడలేదు
రంజీ ట్రోఫీ 2022-23లో భాగంగా అసోంతో మ్యాచ్ సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ ట్రిపుల్ సెంచరీ(379) బాది పలు సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో తన ఇన్నింగ్స్, జాతీయ జట్టులో అవకాశాలు, తనపై ఉన్న విమర్శలు, నెటిజన్ల విసుర్లు తదితర అంశాలపై షా స్పందించాడు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు జవాబులిస్తూ.. ‘‘ఈనాటి ఈ ఇన్నింగ్స్ గురించి సీనియర్లు ఎవరూ కూడా నాతో మాట్లాడలేదు.
నాకు తల పొగరా?!
మీరన్నట్లు పేరు ప్రఖ్యాతులు, డబ్బు వల్ల నాకు తల పొగరు వచ్చిందనే వాళ్లూ ఉంటారు. కొంతమంది తమకు ఏం అనిపిస్తే అది సోషల్ మీడియాలో రాసుకొస్తారు. నిజానికి అలాంటి వాళ్లు నన్ను నేరుగా కలిసి మాట్లాడేదేమీ ఉండదు. కానీ.. పిచ్చి రాతలు రాస్తారు.
అయితే, నేను వాటిని పట్టించుకోను. నా పని నేను చేసుకుంటా. కొన్నిసార్లు అలాంటి కామెంట్లు నా దృష్టికి వచ్చినా తేలికగా తీసుకుంటా. వాళ్లతో నాకు పనిలేదు. ఆటగాడిగా ఎలా ఒక్కో మెట్టు ఎక్కాలి? ఆటకు మెరుగులు దిద్దుకోవాలంటే ఏం చేయాలి? అన్న అంశాల మీదే నా దృష్టి ఉంటుంది’’ అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.
కచ్చితంగా హర్ట్ అవుతా! అయితే..
ఇక టీమిండియాలో పునరాగమనం గురించి అడగగా.. ‘‘అవును.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా.. సెలక్టర్లు నా పేరు పరిగణనలోకి తీసుకోకపోతే కచ్చితంగా హర్ట్ అవుతా. నా మనసు బాధ పడుతుంది. అయితే, మన ఆధీనంలో లేని అంశాల గురించి ఎక్కువగా ఆలోచించినా ప్రయోజనం ఉండదు.
మనకు ఏం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. ఒకవేళ ఆయన దయతలిస్తే మళ్లీ టీమిండియా తరఫున ఆడే అవకాశం వస్తుంది. అయితే, ఇప్పుడు నా దృష్టి మాత్రం రంజీ మీదే ఉంది. ముంబైని విజేతగా నిలపడంలో నా వంతు కృషి చేయాలి అని భావిస్తున్నా’’ అని పృథ్వీ షా తన మనసులోని భావాలు పంచుకున్నాడు.
పంత్ స్థానంలో పృథ్వీ?!
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021- 23 ఫైనల్ రేసులో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇప్పటికే తుది పోరుకు అర్హత సాధించిన ఆసీస్‌ను చిత్తుగా ఓడిస్తేనే రోహిత్ సేనకు అవకాశాలు మెరుగుపడతాయి. లేదంటే.. భారీ మూల్యం చెల్లించకతప్పదు. ఇదిలా ఉంటే.. కారు ప్రమాదం కారణంగా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
అదే సమయంలో పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పంత్ స్థానంలో షా వంటి విధ్వంసకర ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జై షా ట్వీట్!
మరోవైపు.. టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ టెస్టు ఎంట్రీకి సమయం ఆసన్నమైందని గౌతం గంభీర్ వంటి మాజీలు అంటున్నారు. ఈ క్రమంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టోర్నీకి భారత జట్టు ఎంపిక సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో పృథ్వీని అభినందిస్తూ బీసీసీఐ కార్యదర్శి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అద్భుతమైన ప్రతిభాపాటవాలు.. నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ జై షా పేర్కొన్నాడు. ఇందుకు స్పందిస్తూ పృథ్వీ కృతజ్ఞతలు తెలిపాడు. @@మీ మాటలు నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయి. మరింత కఠినంగా శ్రమించేలా ప్రోత్సహిస్తాయి’’ అని పృథ్వీ బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో పృథ్వీకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అనిపిస్తోంది! త్వరలోనే పునరాగమనం చేస్తాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లైకులు, రీట్వీట్లతో వైరల్ చేస్తున్నారు.
చదవండి: ODI WC 2023: ఇక బుమ్రా లేకుండానే...! ఉమ్రాన్ ఆ లోటు తీర్చగలడు.. కానీ..
క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. సిరీస్ బహిష్కరణ
Thank you so much @JayShah sir. Your words of encouragement means a lot. Will keep working hard. https://t.co/RoDw5FbUEV
— Prithvi Shaw (@PrithviShaw) January 11, 2023