విల్‌ జాక్స్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు | Pretoria Capitals Opener Will Jacks Smashed Fastest Century In 42 Balls In SA20 History, Video Goes Viral - Sakshi
Sakshi News home page

SA20 2024-Will Jacks Century: విల్‌ జాక్స్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు

Published Fri, Jan 19 2024 8:32 AM

Pretoria Capitals Opener Will Jacks Smashed Fastest Century In SA20 History - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌తో నిన్న (జనవరి 18) జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఓపెనర్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు విల్‌ జాక్స్‌ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో జాక్స్‌ కేవలం 41 బంతుల్లోనే 8 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి, లీగ్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. జాక్స్‌ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌.. జాక్స్‌ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో జాక్స్‌తో పాటు కొలిన్‌ ఇంగ్రామ్‌ (23 బంతుల్లో 43), ఫిలిప్‌ సాల్ట్‌ (13 బంతుల్లో 23) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో రీస్‌ టాప్లే (4-1-34-3) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. జూనియర్‌ డాలా 2, కేశవ్‌ మహారాజ్‌, మార్కస్‌ స్టోయినిస్‌, కీమో పాల్‌, ప్రిటోరియస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఛేదనలో తడబడిన సూపర్‌ జెయింట్స్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాట్‌తో విజృంభించిన విల్‌ జాక్స్‌.. బంతితోనూ (3-0-18-2) రాణించాడు. అతనితో పాటు వేన్‌ పార్నెల్‌ (2/54), విల్యోన్‌ (2/39), నీషమ్‌ (1/28) వికెట్లు తీశారు. సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో మాథ్యూ బ్రీట్జ్కీ (33) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. డికాక్‌ (25), స్మట్స్‌ (27), కేశవ్‌ మహారాజ్‌ (25 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement