
ప్రణయ్ కూడా రెండో రౌండ్‌లోకి
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
పారిస్: మరో పతకం లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అడుగు పెట్టిన భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, ప్రణయ్ తొలి రౌండ్ అడ్డంకిని దాటారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో మాజీ చాంపియన్ సింధు 23–21, 21–6తో ప్రపంచ 69వ ర్యాంకర్ కలోయానా నల్బంతోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 15వ ర్యాంకర్ సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది.
సింధు రెండుసార్లు గేమ్ పాయింట్లను కాచుకోవడం గమనార్హం. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్‌లో మాత్రం దూకుడుగా ఆడింది. స్కోరు 6–5 వద్ద సింధు చెలరేగి వరుసగా 14 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ 40వ ర్యాంకర్ కరుపథెవన్ లెట్షానా (మలేసియా)తో సింధు ఆడుతుంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో 2023 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత ప్రణయ్ 21–18, 21–15తో ప్రపంచ 47వ ర్యాంకర్ జోకిమ్ ఒల్డార్ఫ్ (ఫిన్‌లాండ్)పై గెలుపొందాడు. 47 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌కు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. నేడు జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్‌సెన్ (డెన్మార్క్)తో ప్రణయ్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో ఇద్దరు 2–2తో సమంగా ఉన్నారు.
రుత్విక–రోహన్ జోడీ బోణీ
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 18–21, 21–16, 21–18తో లియోంగ్ లోక్ చోంగ్–ఎన్జీ వెంగ్ చి (మకావ్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ చెన్ టాంగ్ జి–తో ఈ వె (మలేసియా)తో రుత్విక–రోహన్ ద్వయం పోటీపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జోడీ 15–21, 5–21తో లియు కువాంగ్ హెంగ్–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం నేడు జరిగే రెండో రౌండ్‌లో లియు కువాంగ్ హెంగ్–యాంగ్ పో హాన్‌లతో ఆడుతుంది.