
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (SRH vs DC) అనుసరించిన వ్యూహాలను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ విమర్శించాడు.ప్లే ఆఫ్స్ చేరాలంటే కీలకమైన మ్యాచ్‌లోనూ ఓపెనింగ్ జోడీని మార్చడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. ఢిల్లీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బుద్ధిలేని చర్యగా అభివర్ణించాడు.
ఐపీఎల్-2025 (IPL 2025)లో ఢిల్లీ తరఫున జేక్ ఫ్రేజర్ మెగర్క్, అభిషేక్ పోరెల్, ఫాఫ్ డుప్లెసిస్, కేఎల్ రాహుల్ వేర్వేరు మ్యాచ్‌లలో ఓపెనర్లుగా వచ్చారు. తాజాగా సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ సందర్భంగా డుప్లెసిస్‌తో కలిసి కరుణ్ నాయర్ (Karun Nair) ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభించాడు.
బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలు
అయితే, బంతి పడటంతోనే క్యాపిటల్స్‌కు కష్టాలు మొదలయ్యాయి. మొదటి బంతికే కరుణ్ నాయర్ (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే డుప్లెసిస్ (3), అభిషేక్ పొరెల్ (8)లు కూడా వికెట్లను పారేసుకున్నారు. దీంతో క్యాపిటల్స్ 15 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ మూడు వికెట్లూ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ఖాతాలోనే పడ్డాయి. క్యాచ్‌లన్నీ కీపర్ ఇషాన్ కిషన్ చేతికే అందాయి.
ఇక ఢిల్లీ ఈ షాక్ నుంచి తేరుకోకముందే హర్షల్ పటేల్ మరోదెబ్బ తీశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (6)ను అవుట్ చేశాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన స్లో డెలివరీని షాట్ ఆడే ప్రయత్నం చేయగా అదికాస్తా కమిన్స్ చేతికి చిక్కింది.
దీంతో పవర్ ప్లేలో ఢిల్లీ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. అప్పటికి క్యాపిటల్స్ స్కోరు 26/4. ఆ తర్వాత కూడా క్యాపిటల్స్ పరిస్థితిలో ఏమార్పు లేదు. ఇక ఢిల్లీ అండదండా కేఎల్ రాహులే అనుకునేలోపే ఈ స్టార్ మురిపెం కూడా అంతలోనే ముగిసింది.
జయదేవ్ ఉనాద్కట్ తెలివైన బంతితో ఈ విలువైన వికెట్ తీసి ఢిల్లీని కోలుకోకుండా చేశాడు. ఆఫ్ స్టంప్ ఆవల దూసుకొచ్చిన బంతి రాహుల్ (10) బ్యాట్‌ను తాకుతూ ఇషాన్ కిషన్ చేతుల్లోకి వెళ్లింది.
అప్పటివరకు పెవిలియన్ చేరిన ఐదుగురిలో అతనొక్కడిదే రెండంకెల స్కోరు కాగా... కనీసం మూడు పదుల స్కోరైన కాకముందే (29 పరుగులకే 5) ఢిల్లీ సగం వికెట్లను కోల్పోయింది. వికెట్ల జోరులో మెరుపుల్లేని మ్యాచ్‌లో ఎట్టకేలకు పదో ఓవర్లో ఒక సిక్స్ నమోదైంది. స్పిన్నర్ జిషాన్ బౌలింగ్‌లో విప్రాజ్ నిగమ్ భారీ సిక్సర్ బాదాడు. సగం ఓవర్లు ముగిశాక గానీ 11వ ఓవర్లో జట్టు స్కోరు కష్టంగా 50 పరుగులకు చేరింది.
అశుతోశ్ వచ్చాకే...
స్టబ్స్, విప్రాజ్ కుదురుకునే అవకాశాన్ని కూడా సన్‌రైజర్స్ ఫీల్డర్లు ఇవ్వలేదు. కొద్దిసేపటికే విప్రాజ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రనౌట్ కాగా... అశుతోష్ రాకతో స్కోరులో కాస్త వేగం పెరిగింది. అవతలి ఎండ్‌లో ఉన్నది హిట్టర్ స్టబ్సే అయినా జోరు పెంచింది మాత్రం అశుతోష్ మొదట్లో సింగిల్స్‌తో పరుగు... పరుగు పేర్చిన ఈ జోడీ తర్వాత ధాటిని ఆడింది.
జీషాన్ 15వ ఓవర్లో అశుతోష్ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు. తర్వాత హర్షల్ 17వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. స్టబ్స్ కూడా ఫోర్లతో వేగం అందుకోగా, డెత్ ఓవర్లో మరో సిక్స్ కొట్టిన అశుతోష్ ఆఖరి ఓవర్లో నిష్క్రమించాడు.
ఇద్దరు కలిసి ఏడో ఓవర్‌కు 66 పరుగులు జోడించారు. ఈ జోడీ ఆడటం వల్లే ఢిల్లీ ఆలౌట్ నుంచి తప్పించుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది.
ఢిల్లీ క్యాపిటల్స్‌ది తప్పుడు నిర్ణయం
ఈ నేపథ్యంలో కామెంటేటర్ షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటికప్పుడు ఏ కారణం లేకుండా.. నచ్చినట్లుగా ఓపెనింగ్ జోడీని మార్చడం సరికాదు. నిజంగా ఢిల్లీ వ్యూహం చూసి నేను ఆశ్చర్యపోయా.
కరుణ్ నాయర్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి ఓపెనింగ్‌కు రావడం చూసి నాకు మతిపోయినంత పనైంది. ఇదొక చెత్త నిర్ణయం. ఢిల్లీ శిబిరం ఏం ఆలోచించి ఇలా చేసిందో గానీ.. ఇదైతే తప్పుడు నిర్ణయం.
ఇలా చేయడం వల్ల జట్టులో ఎవరి పాత్ర ఏమిటన్నది ఆటగాళ్లకే తెలియకుండా పోతుంది. ఇలాంటి చర్యల వల్ల వాళ్లు కూడా అభద్రతాభావంలో కూరుకుపోతారు’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయంం పంచుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఎడతెరిపిలేని వర్షం వల్ల మ్యాచ్ రద్దై పోయింది. దీంతో ఢిల్లీకి అదృష్టం కలిసి రాగా.. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. మ్యాచ్ రద్దు కావడం వల్ల ఇరుజట్లకు చెరో పాయింట్ రాగా.. ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు సజీవమయ్యాయి.
చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
Wickets ✅
Catch ✅
Captaincy ✅
Pat Cummins is producing a perfect performance for #SRH in an important clash against #DC 🔥
Updates ▶ https://t.co/1MkIwk4VNE#TATAIPL | #SRHvDC | @SunRisers | @patcummins30 pic.twitter.com/SbACH0yVcJ— IndianPremierLeague (@IPL) May 5, 2025