షమీ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..! | Mohammed Shami likely to make India return | Sakshi
Sakshi News home page

షమీ రీఎంట్రీకి ముహూర్తం ఖరారు..!

May 9 2026 8:34 AM | Updated on May 9 2026 8:59 AM

Mohammed Shami likely to make India return

వెటరన్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ టీమిండియా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీసీసీఐలో సీరియస్‌గా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఐపీఎల్‌ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఏకైక టెస్ట్‌ కోసం షమీ ఎంపికకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటనే తారువాయి అని ఓ ప్రముఖ వెబ్‌సైట్‌ రాసుకొచ్చింది.

షమీ గతకొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా ప్రతి దేశవాలీ పోటీలో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లోనూ లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు. వాస్తవానికి షమీ రీఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది. కానీ, ఎందుకో వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సెలెక్టర్లు అతన్ని కరుణించినట్లు తెలుస్తోంది. అతడు చివరిగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాడు.

చాలామంది షమీ కెరీర్‌ ఖతమైందని అనుకున్నారు. కానీ అతడు మాత్రం ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. రోజురోజుకు మెరుగవుతూ 35 ఏళ్ల లేటు వయసులో రీఎంట్రీకి సిద్దమయ్యాడు. ప్రస్తుతం షమీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఈ మధ్యలో అతను ఎలాంటి గాయాల బారిన పడకపోతే, ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌లో బరిలోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే.

ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌ కోసం మరో సీనియర్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్‌ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్‌ మ్యాచ్‌లో సిరాజ్‌కు జోడీగా షమీ బంతిని షేర్‌ చేసుకోవచ్చు.  

ఈ మ్యాచ్‌ కోసం ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కార్తిక్ త్యాగి లాంటి యువ పేసర్ల పేర్లను కూడా పరిగణలో​కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రస్తుత ఐపీఎల్‌లో ఇరగదీస్తున్నారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జూన్‌ 6 నుంచి ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement