ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్, ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భారత మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ఐపీఎల్ 2026 నేపథ్యంలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఇండియన్ మీడియాపై చిందులేశాడు. తాను ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరు కాకపోవడానికి కారణాలు వెల్లడిస్తూ.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.
అసలేం జరిగిందంటే.. స్టార్క్ ఐపీఎల్ 2026 ప్రీ-సీజన్ శిక్షణా శిబిరానికి హాజరుకాలేదు. ఈ గైర్హాజరు వెనుక కారణాలపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వినిపించాయి. కొందరు క్రికెట్ ఆస్ట్రేలియా అతనికి NOC ఇవ్వలేదని.. వర్క్‌లోడ్ కారణంగా ఐపీఎల్ ఆడకూడదన్న కండీషన్ పెట్టిందని వార్తలు వచ్చాయి. అయితే, స్టార్క్ స్వయంగా ఈ ఊహాగానాలకు తెరదించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. తనకు భుజం మరియు మోచేతి గాయాలు ఉన్నాయని, వాటి తీవ్రతను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానని వెల్లడించాడు. భారత మీడియాలోని కొన్ని వర్గాలకు నా శరీరం గురించి నాకన్నా ఎక్కువ తెలిసినట్లు ప్రచారం చేస్తున్నాయని చురకలంటించాడు.
నిజానికి నేను ప్రస్తుతం రిహాబ్‌లో ఉన్నాను. ఈ గాయం ఢిల్లీ జట్టుకు, అభిమానులకు అసౌకర్యం కలిగించి ఉండవచ్చు. దీనికి నేను క్షమాపణ చెబుతున్నానని వివరణ ఇచ్చాడు. మేనేజ్‌మెంట్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని, వీలైనంత త్వరగా జట్టులో చేరేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.
కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో స్టార్క్ లేని లోటు జట్టుకు పెద్ద సవాలుగా మారనుంది. కైల్ జేమీసన్, లుంగి ఎంగిడి, దుష్మంత చమీరా వంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. స్టార్క్ లేని లోటు భర్తీ చేయలేనిదని మేనేజ్‌మెంట్ భావిస్తుంది.


