ముంబై: పొరుగు రాష్ట్ర నగరం అహ్మదాబాద్‌లో ఉన్నట్లే ముంబైలోనూ లక్ష మంది ప్రేక్షకులు వీక్షించే భారీ స్టేడియం రూపకల్పనలో ముంబై క్రికెట్ సంఘం (MCA) నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్ మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలతో చర్చించినట్లు తెలిసింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ప్రతిపాదిత స్టేడియం నిర్మించేందుకు ఎంసీఏ కృషి చేస్తోంది. ఇందులో భాంగా గురువారం ఎంసీఏ చీఫ్ నాయక్... ముంబై సిటీ–మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (సీఐడీసీఓ) ఉన్నతాధికారులతో ఈ ప్రాజెక్ట్ విషయమై చర్చించారు.
ప్రపంచ క్రీడాపటంలో
‘ఎంసీఏ చొరవ మహారాష్ట్ర క్రీడా వ్యవస్థలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. ఎంఎంఆర్ ప్రాంతంలో మేం ప్రతిపాదించిన ప్రాజెక్టు పూర్తయితే గనక కేవలం ముంబై క్రికెట్‌నే కాదు... ప్రపంచ క్రీడాపటంలో మహారాష్ట్రనే సమున్నత స్థానంలో నిలబెడుతుంది’ అని అజింక్యా నాయక్ అన్నారు.
అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఆటగాళ్ల నైపుణ్యాభివృద్ధికి అసమానమైన అవకాశాల్ని కలిపిస్తుందని పేర్కొన్నారు. అదే విధంగా.. వర్ధమాన క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా అపార అవకాశాల్ని సృష్టిస్తుందని, అన్ని స్థాయిల క్రికెట్ రూపురేఖల్ని మారుస్తుందని అజింక్య నాయక్ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు.


