కేకేఆర్ వెటరన్ బ్యాటర్ మనీశ్ పాండే చరిత్ర సృష్టించాడు. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత ఐపీఎల్ అన్ని ఎడిషన్లలో (19) కనీసం ఒక్క మ్యాచ్ ఆడిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున బరిలోకి దిగడంతో ఈ రేర్ ఫీట్‌ను అందుకున్నాడు.
ఐపీఎల్ అరంగేట్రం ఎడిషన్‌లో అరంగేట్రం చేసిన మనీశ్.. అప్పటి నుంచి వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున నిరంతర ప్రయాణం కొనసాగించాడు. ప్రతి సీజన్‌లో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడి స్థిరత్వాన్ని చాటుకున్నాడు. ఈ సీజన్‌లో మనీశ్‌కు సన్‌రైజర్స్ మ్యాచే తొలి మ్యాచ్.
ఈ మ్యాచ్‌లో అతను రమన్‌దీప్ స్థానంలో బరిలోకి దిగాడు. అయితే అతనికి బ్యాటింగ్ అవకాశం రాలేదు. సన్‌రైజర్స్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ బ్యాటర్లు మనీశ్ వరకు రాకుండానే ఛేదించారు.
ధోనీ కూడా చేరొచ్చు
విరాట్, రోహిత్, మనీశ్ సరసన ధోని కూడా చేరే అవకాశం ఉంది. ధోని సైతం గత 18 ఐపీఎల్ ఎడిషన్లలో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాడు. ఈ సీజన్‌లో అతను బరిలోకి దిగాల్సి ఉంది. ధోని గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఐపీఎల్‌లో మనీశ్ ప్రస్థానం
ముంబై ఇండియన్స్‌తో కెరీర్ ప్రారంభించిన మనీశ్.. ఆపై ఆర్సీబీ, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా మొత్తం ఏడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌లో 175 మ్యాచ్‌లు ఆడిన మనీశ్ సెంచరీ, 22 అర్ద సెంచరీల సాయంతో 3942 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 121.5గా ఉంది.


