ఐపీఎల్‌ మధ్యలో కీలక పరిణామం | Lakshmi Mittal Announces Acquisition Of Rajasthan Royals Franchise During IPL 2026, Read Full Details Abouts Deal | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ మధ్యలో కీలక పరిణామం

May 3 2026 4:46 PM | Updated on May 3 2026 5:34 PM

Lakshmi Mittal announces acquisition of Rajasthan Royals franchise

ఐపీఎల్‌ 2026 మధ్యలో కీలక పరిణామం చోటు చేసుకుంది. టైటిల్‌ ప్రధాన పోటీదారుల్లో ఒకటైన రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్య హక్కులు చేతులు మారాయి. స్టీల్‌ టైకూన్‌ లక్ష్మీ మిత్తల్‌ నేతృత్వంలోని కన్సార్టియం రాయల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ ఏకంగా 1.65 బిలియన్ డాలర్లు (సుమారు రూ.15,660 కోట్లు)గా అంచనా వేయబడింది.

మిత్తల్ కుటుంబం ఈ ఫ్రాంచైజీలో సుమారు 75 శాతం వాటాను కలిగి ఉండనుంది. అదార్‌ పూనావాలా 18 శాతం వాటాను పొందగా, మిగిలిన 7 శాతం వాటా ప్రస్తుత పెట్టుబడిదారుల వద్దే ఉంటుంది. ప్రస్తుత ప్రధాన యజమాని మనోజ్‌ బదలే ఫ్రాంచైజీతో అనుబంధాన్ని కొనసాగించనున్నారు.

లక్ష్మీ మిత్తల్‌కు రాజస్థాన్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. అతను ఇక్కడే జన్మించారు. అందుకే రాజస్థాన్ రాయల్స్‌తో అనుబంధం తనకు ప్రత్యేకమని పేర్కొన్నారు. రాజస్థాన్‌కు చెందిన జట్టులో భాగమవడం నాకు ఎంతో గౌరవంగా ఉందని ఆయన  చెప్పుకొచ్చారు.

ఒప్పందంలో భాగమే..!
ఈ కొనుగోలు మిగతా రాయల్స్‌ ఫ్రాంచైజీలకు కూడా వర్తించనుంది. రాజ​స్థాన్‌ రాయల్స్‌కు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోని పార్ల్‌ రాయల్స్‌, కరీబియర్‌ ప్రీమియర్‌ లీగ్‌లోని బార్బడోస్‌ రాయల్స్‌ సిస్టర్‌ ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. తాజా డీల్‌తో ఈ ఫ్రాంచైజీల యాజమాన్య హక్కులు కూడా చేతులు మారాయి. ఈ ఫ్రాంచైజీల్లో కూడా 75 శాతం వాటా మిత్తల్‌ గ్రూప్‌ ఆధీనంలోకి రానుంది.

అనుమతులు మిగిలి ఉన్నాయి
ఈ ఒప్పందం అమలుకు బీసీసీఐ, సీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సహా సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు అవసరం. అన్ని అనుమతులు లభిస్తే 2026 మూడో త్రైమాసికంలో ప్రక్రియ పూర్తికానుంది.

అతిభారీ డీల్స్‌లో ఒకటి
ఈ కొనుగోలు ఐపీఎల్ చరిత్రలోనే అతి భారీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ భవిష్యత్తుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు తదుపరి ఆడాల్సిన 4 మ్యాచ్‌ల్లో 3 గెలిస్తే ఎలాంటి జంఝాటం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement