శ్రీలంక క్రికెట్‌లో అనూహ్య పరిణామం.. కొత్త కెప్టెన్‌ ఎంపిక | Kusal Mendis becomes Sri Lanka ODI and T20I captain | Sakshi
Sakshi News home page

శ్రీలంక క్రికెట్‌లో అనూహ్య పరిణామం.. కొత్త కెప్టెన్‌ ఎంపిక

May 10 2026 4:28 PM | Updated on May 10 2026 4:34 PM

Kusal Mendis becomes Sri Lanka ODI and T20I captain

శ్రీలంక క్రికెట్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వైట్‌బాల్‌ (టీ20, వన్డే) కెప్టెన్‌గా కుసాల్‌ మెండిస్‌ ఎంపికైనట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయి అని తెలుస్తోంది. దసున్‌ షనక టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడని సమాచారం. ఈ మేరకు అతను బోర్డును రిసిగ్నేషన్‌ కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు చరిత్‌ అసలంకను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని సమాచారం. రెండు ఫార్మాట్లలో ఒకే కెప్టెన్‌ ఉండాలనే ఉద్దేశంతో ఈ కుసాల్‌ మెండిస్‌ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు టెస్ట్‌ కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వ కొనసాగనున్నాడు.

31 ఏళ్ల కుసాల్ మెండిస్ ఇటీవలికాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ​్‌-2026లో పెషావర్‌ జల్మీ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 11 మ్యాచ్‌లు ఆడిన అతను.. 550 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 55, స్ట్రైక్‌రేట్ 160తో నమోదు చేశాడు.

కుసాల్‌ గత ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఆడింది ఒకటే మ్యాచ్‌ అయినా ప్రభావంతంగా కనిపించాడు. జోస్‌ బట్లర్‌ గాయపడటంతో అతనికి రీప్లేస్‌మెంట్‌గా వచ్చిన మెండిస్‌.. ఓ మ్యాచ్‌లో 200 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు.

కాగా, శ్రీలంక జట్టుకు మున్ముందు బిజీ షెడ్యూల్‌ ఉంది. త్వరలోనే వెస్టిండీస్‌ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌, భారత్‌ పర్యటనలు కూడా ఉన్నాయి. ఈ సిరీస్‌లతో కుసాల్ మెండిస్ కెప్టెన్సీకి అసలైన పరీక్ష మొదలుకానుంది.

Advertisement
 
Advertisement
Advertisement