ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బాంబు పేల్చాడు. టీ20 క్రికెట్‌లో తనకు పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉండేవి కావని తెలిపాడు. బీసీసీఐ తనను టీ20 క్రికెట్‌లో ఎప్పుడూ ఆటగాడిగా పరిగణించలేదని, కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే తనపై ముద్ర వేశారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జియో హాట్‌స్టార్‌కు చెందిన సూపర్‌స్టార్స్ షోలో కేఎల్ రాహుల్ మాట్లాడాడు.
‘పదేళ్ల క్రితం టీ20 జట్టులో భాగం కావడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ నన్ను ఎప్పుడూ ఒక టీ20 ఆటగాడిగా పరిగణించలేదు. కనీసం ఒక మంచి వైట్‌బాల్ ఆటగాడిగా కూడా చూడలేదు. కేవలం ఒక టెస్టు ప్లేయర్‌గానే నాపై ముద్రను వేశారు. అయితే ఐపీఎల్ ద్వారా టెస్టు ప్లేయర్ అనే ముద్ర నుంచి బయటపడి వైట్‌బాల్ క్రికెట్‌లో నా ఆటను మరింత మెరుగుపరుచుకొని ఇవాళ ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉంది.
అయితే ఈ ప్రయాణంలో ఎన్నో తప్పులు చేసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేశాను. జట్టుకు ఆడినప్పుడల్లా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. ఫలితంతో సంబంధం లేకుండా నా ఆటను నేను ఆడుకుంటూ సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాను. అయితే ఆటగాడిగా నాకు ఇంకా సమయం మిగిలి ఉంది.
కాబట్టి నేను నా వంతుగా జట్టుకు తరఫున మ్యాచ్‌లు ఆడుతూ స్కోర్లు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక గతేడాది నేను తండ్రి కావడం సంతోషాన్ని ఇచ్చింది. ఈ కొత్త పాత్ర నా క్రికెట్ కెరీర్‌కు కూడా ఎంతో సహాయపడింది. నా కూతురు నవ్వినప్పుడు అప్పటివరకు నేను బాధపడిన క్షణాలన్నీ మాయమౌతాయి.’ అని చెప్పుకొచ్చాడు.
ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. సూపర్‌ఫామ్‌లో ఉన్న రాహుల్ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ 64 బంతుల్లోనే 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో రికార్డు సృష్టించాడు. అంతేకాదు సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ 9 మ్యాచ్‌ల్లో 433 పరుగులు సాధించాడు.
ఆరెంజ్ క్యాప్ రేసులో రాహుల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2022లో టీమిండియా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ అప్పటినుంచి కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు.
చదవండి: మాట తప్పిన రిషబ్ పంత్!


