రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ "అన్‌ప్రొఫెషనల్" అనడం సోషల్ మీడియాలో పెను దుమారం రేపింది. జితేష్ ఇటీవల సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా జితీష్ మాట్లాడుతూ.. "వైభవ్‌కు అస్సలు ప్రొఫెషనలిజం లేదు.
ప్రతీ ఒక్కరూ అతడిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అతడు మైదానంలో బాగానే ఉంటున్నాడు. కానీ ఆఫ్‌ది ఫీల్డ్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాడు. నేనూ అతడిని మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినవద్దని చెబుతూనే ఉన్నాను. అయినా నా మాట వినడం లేదు అని చెప్పుకొచ్చాడు.
అయితే వైభవ్ పట్ల జితేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీశాయి. తను చేసిన కామెంట్స్‌పై తాజాగా జితేష్ స్పష్టత ఇచ్చాడు. వైభవ్ తనకు మంచి స్నేహితుడని, ఆన్‌ది ఫీల్డ్, ఆఫ్‌ది ఫీల్డ్ ఎలా ఉంటాడో అన్నది వివరించాని జితేష్ తెలిపాడు. తన వ్యాఖ్యలను తప్పు ఆర్ధంగా చేసుకున్నారని ఓ పాడ్‌కాస్ట్‌లో అతడు చెప్పుకొచ్చాడు.
"వైభవ్ 15 ఏళ్ల పిల్లవాడు. అతడికి ఐస్‌క్రీమ్ అంటే చాలా ఇష్టం. అతడు నా గదికి వచ్చి కూడా ఐస్‌క్రీమ్ తింటాడు. నేను తినను, అతడు మాత్రమే తింటాడు. ఒక చిన్న పిల్లాడు ఐస్‌క్రీమ్ కాకుండా ఇంకేం తింటాడు? వైభవ్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అతడు మా ఇంటికి కూడా వస్తాడు, నా భార్యతో మాట్లాడతాడు.
యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తుంటాడు. అతడు నాకు తమ్ముడి లాంటి వాడు. బయట వ్యక్తులు ఏమునుకున్నా నేను పట్టించుకోను. నేను అతడి అల్లరిని ఉద్దేశించి ప్రొఫెషనల్‌గా లేడు అన్నా. అతడు అంత చిన్న వయస్సులో అద్బుతంగా రాణిస్తున్నాడు కాబట్టి, అందరూ అతడి నుంచి ఎక్కువగా క్రమశిక్షణను ఆశిస్తున్నారు.
కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే.. అతడికి ఇంకా 15 ఏళ్లే. ఒక చిన్నపిల్లాడిని చిన్నపిల్లాడిలాగే ఉండనివ్వండి. నేను అతడికి పూర్తి స్వేఛ్చ ఇస్తాను. నీకు ఇంకా పదిహేనేళ్లే కదా, టీవీ చూసుకో, నీకు నచ్చినవి తిను, కేవలం నీ బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టు అని చెబుతూ ఉంటా" అని జితీష్ పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది సీజన్‌లో వైభవ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 404 పరుగులు చేశాడు.


